Vastu Dosha: ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. చేతిలో డబ్బు ఉన్నా ఇంట్లో ఆహారాలు నిలువ ఉన్నా తినేందుకు ఆరోగ్యం సహకరించదు. దీంతో తామేమి పాపం చేశామని బాధపడుతుంటారు. దీనికి వాస్తు ప్రభావమే కారణం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డబ్బు ఎంత సంపాదించినా వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టు తిరగాల్సి వచ్చినందున పైసలు మంచినీళ్లలా ఖర్చయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అనారోగ్య సమస్యలతో ఆందోళన మరింత పెరుగుతుంది.

ఇల్లు వాస్తుప్రకారం నిర్మించుకోకపోతే ఆ ఇంటిలో అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. గృహిణికి నిరంతరం అనారోగ్యం కలుగుతుంటే ఇంటికి వాస్తుదోషం ఉందేమో చూసుకోవాలి. ఎక్కడ వాస్తు దోషం ఉంటే అక్కడ మహిళలు అనారోగ్యం బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ, నైరుతి దిశలో వాస్తు దోషమున్నా, వీధిపోటు కలిగినా అనారోగ్యాలు దరిచేరడం సహజమే. దక్షిణ, నైరుతి దిశలో వీధిపోటు ఉన్నట్లయితే దాని నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. గృహిణి ఆరోగ్యం కోసం యజమాని పలు పరిష్కార మార్గాలు అన్వేషించాలి.
మనం నిద్రపోయేటప్పుడు దక్షిణం వైపు కాళ్లుపెట్టకూడదు. మంచానికి ఎదురుగా అద్దాలు ఉండకూడదు. మెట్ల కింద స్టోర్ రూం ఏర్పాటు చేసుకోకూడదు. స్టోర్ రూంలో చెత్త చెదారం వేయడం వల్ల కూడా మహిళలకు అనారోగ్యాలు దరిచేరతాయి. బూజు దులుపుకోకుండా ఇంటిని ఉంచుకుంటే కూడా నష్టాలే. కిటికీలు, తలుపులు తెరవకుండా సూర్యకాంతి ఇంట్లో పడనీయకుండా చీకటిగా ఉంటే కూడా రోగాలు రావడం జరుగుతుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా కిటికీలు, తలుపులు ఏర్పాటు చేసుకోవడం మంచిది.

ఆగ్నేయ దిశలో వంట, నైరుతి దిశలో పడకగది ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో కుళాయి నుంచి తరచుగా నీరు కారుతుంటే కూడా వాస్తు దోషం ఉన్నట్లే. నీరు లీకేజీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబానికి కావాల్సిన డబ్బు సంపాదించేది పురుషుడు. ఇల్లును చక్కబెట్టేది స్త్రీ. దీంతో గృహిణి ఆరోగ్యంగా లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాస్తుదోషాలు లేకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే గృహిణికి ఉపశమనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్యాన్ని లెక్కలోకి తీసుకుని వాస్తు దోషాలు లేకుండా చేసుకోవడమే ఉత్తమం.