YS Viveka Murder Case: ఆయనో మాజీ మంత్రి. ఆ ప్రాంతం వారికి పెట్టని కోట. సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటన్నారు. తర్వాత గొడ్డలిపోటు అన్నారు. ప్రతిపక్షమే చేయించిందని ప్రచారం చేశారు. చివరికి పేగుబంధం ఉన్నవారే సీబీఐ గడప తొక్కనున్నారు. ఆయనే మాజీ మంత్రి వివేకానందరెడ్డి. వివేకా హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. బంధువుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి.. మరి నెక్ట్స్ ఎవరు ? అన్న చర్చ జరుగుతోంది.

కడప జిల్లా పులివెందులలో సీబీఐ అధికారులు పర్యటించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలు, కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. దాదాపు అరగంట సేపు అవినాష్ రెడ్డి కార్యాలయంలో గడిపారు. సీబీఐ అధికారులు వెళ్లే సరికి వైఎస్ భాస్కరరెడ్డి పులివెందుల నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. అవినాష్ రెడ్డి మరో ప్రాంతంలో ఉండటంతో… అవినాష్ రెడ్డి పీఏకు సీబీఐ అధికారులు నోటీసులు అందించారు. అవినాష్ రెడ్డిని 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ముందస్తుగా నిర్ణయించిన పనులు ఉన్న కారణంగా నాలుగు రోజుల తర్వాత సీబీఐ విచారణకు హాజరవుతానని సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబ సభ్యులను విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించడం చర్చనీయాంశమైంది. హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం మేరకు అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. తన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సహాయంతో వైఎస్ వివేకా హత్యకు పాల్పడ్డారని సీబీఐ అనుమానిస్తోంది. వివేకా హత్య అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేయడంలో వైఎస్ అవినాష్ రెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

వైఎస్ వివేకా హత్యకేసులో మొదట టీడీపీ నేతల్ని నిందితులుగా చేర్చే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వివేకా కూతురు సునీతరెడ్డి ఎంట్రీతో సీన్ మారింది. సొంతవారి పాత్ర ఇందులో ఉందని ఆమె తేల్చిచెప్పింది. ఏపీలో కేసు విచారణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించింది. దీంతో హత్యకేసు విచారణ తెలంగాణలో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైఎస్ అవినాష్ రెడ్డి తర్వాత ఇంకెవరికి సీబీఐ నోటీసులు అందుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్ ను విచారించే అవకాశం ఏమైనా ఉందా ? అన్న చర్చ కూడా జరుగుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు సహకరిస్తారా.. లేదా అనే అంశం పైన మిగిలిన కేసు విచారణ ఆధారపడి ఉంటుంది.