Rahul Dravid- Team India: నిన్నమొన్నటి వరకు ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా బలమైన జట్టు. కానీ ఇప్పుడు పసికూన బంగ్లాదేశ్‌ను కూడా ఓడించే శక్తిలేని బలహీన టీం. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ నుంచి అవమానకర రీతిలో ఇంటిదారి పట్టిన ఫెయిల్యూర్ జట్టు. టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టు పరిస్థితి దిగజారతోందన్న అభిప్రాయం సగటు క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

ఒక జట్టు లేదు..
టీ20 వరల్డ్ కప్ మరో ఏడాదిలో ఉందనగా ద్రావిడ్‌కు జట్టును అప్పగించారు. ఆ ఏడాదిలో ఒక బలమైన జట్టును తయారు చేయడంలో ద్రావిడ్ విఫలమయ్యాడు. ఒకప్పుడు టీమిండియా అంటే.. పదకొండు మంది ఆటగాళ్ల పేర్లనూ చటుక్కున చెప్పేవారు. సగటు అభిమాని కూడా జట్టు సభ్యుల ఆటతీరుపై ఒక అంచనాకు వచ్చేవారు. కానీ రాహుల్ ద్రావిడ్ జట్టు కోచ్‌గా వచ్చిన తర్వాత భారత జట్టు ఏదో చెప్పడం కష్టంగా మారింది. ఒక స్థిరమైన జట్టు లేకుండా ప్రతీ మ్యాచ్‌లో ప్రయోగాలతో జట్టును ద్రవిడ్ చెడగొట్టేశారన్న భావన క్రికెట్ అభిమానుల్లో ఏర్పడింది. నిఖార్సయిన జట్టును తయారు చేయడంలో ఈ మాజీ క్రికెటర్ విఫలమయ్యాడు. ఇప్పటికీ రోహిత్, రాహుల్, కోహ్లీ తప్ప మిగతా ఆటగాళ్లలో తుది జట్టులో ఎవరు ఉంటారు… ఎవరు ఆడతారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. దీని వల్ల ఒక బలమైన జట్టును తయారు చేయడంలో కోచ్‌గా ద్రావిడ్ ఫెయిల్ అయ్యారు.
అసలు ప్లాన్ ఏంటి?
బలమైన జట్టును నిర్మించడంలో రాహుల్ ద్రావిడ్ ఎంచుకున్న మార్గం ఏదో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ పేరిట ఒక సిరీస్ ఆడిన వారిని మరో సిరీస్ ఆడనివ్వడం లేదు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత సీనియర్లకు కివీస్ పర్యటనలో విశ్రాంతి ఇచ్చేశాడు. బంగ్లాదేశ్ పర్యటనకు మాత్రం అందరినీ ఆడించాడు. అంటే కివీస్ కన్నా బంగ్లాదేశ్ పర్యటన ముఖ్యమని సంకేతాలు పంపినట్లే కదా. అసలు టీమిండియా ఎటు పోతోంది? అని సగటు అభిమాని ప్రశ్నించేలా ఉన్నాయి ద్రావిడ్ విధానాలు. ఈ ఏడాది కాలంలో ఎంతమంది కుర్రాళ్లు అరంగేట్రం చేశారు? మూడు ఫార్మాట్లలో ఎంత మంది కెప్టెన్లు మారారు? అనే లెక్కలు ఫ్యాన్స్‌కు తలనొప్పి తెప్పించేలా ఉన్నాయి. ఇలా ఒక క్లారిటీ లేని జట్టుతో వన్డే వరల్డ్ కప్ ఎలా గెలుస్తారు? అసలు ద్రావిడ్ ఎలాంటి ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు అనేది అభిమానులకే కాదు.. మాజీ క్రికెటర్లకూ అంతుపట్టడం లేదు.

వెంటాడుతున్న గాయాలు..
ద్రావిడ్‌ను మరీ అంతగా విమర్శించలేకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే అతను జట్టు కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. టీ20 వరల్డ్ కప్‌లో చాలా కీలకం అనుకున్న జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఇద్దరూ ఆ టోర్నీకి దూరమయ్యారు. గాయంతో జట్టుకు దూరమైన కేఎల్.రాహుల్ పునరాగమనంలో ఆకట్టుకోలేదు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో తలనొప్పి తెప్పించాడు. తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలో కూడా రోహిత్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ ముగ్గురూ గాయపడ్డారు. వీళ్లు మూడో వన్డే ఆడటం కూడా అనుమానంగా ఉంది. ఇలా కీలకమైన ఆటగాళ్లంతా గాయాల బారిన పడటంతో ద్రావిడ్ హయాంలో ఫిట్‌నెస్ పరీక్షలపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆటగాళ్లకు యో–యో టెస్టులైనా చేస్తున్నారా? క్రికెట్ లవర్స్, భారత క్రికెట్ సగటు అభిమానుల నుంచి వస్తున్న ప్రశ్న.