YS Jagan Mohan Reddy : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద వ్యూహకర్త కాదు. కానీ రాజకీయాల్లో రాణించారు. అది ఎలా సాధ్యం? అంటే మనుషుల సైకాలజీని ఆయన పూర్తిగా చదివేశారు. మీకు నష్టమని ప్రజలకు చెప్పితే పట్టించుకోరు. కానీ నష్టపోయిన తర్వాత సానుభూతి చూపిస్తే కరిగిపోతారు. ఈ ఒక్క ఫార్ములాను అనుసరించి ఏపీని రాజకీయంగా ఏలారు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో తట్టుకోలేకపోయారు ప్రజలు. అప్పటివరకు జగన్ ఒక సాధారణ ఎంపీ. ఒక ముఖ్యమంత్రి కుమారుడు. అంతే సీన్ క్రియేట్ చేశారు. సానుభూతిని పైకి లేపారు. ప్రజల్లో వ్యాపింప చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూతంలా చూపించి.. సమాధి చేసి దానిపై వైసీపీ పునాదులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు రాజకీయాలు చేస్తూ వచ్చారు.
* చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కొక్క నేత గుడ్ బై చెప్పి కూటమి పార్టీలో చేరిపోయారు. ఇటువంటి అశాంతి వాతావరణం లో పార్టీలో ఉన్నవారు ధిక్కారస్వరం వినిపించాలి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే పరిస్థితి ఆ పార్టీలో ఉంది. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు జగన్ గీసిన గీతను దాటరు. తాను బెంగళూరులో ఉండి ప్రభుత్వంపై వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునిస్తే చేస్తారు. తుఫాను బాధితులకు సహాయం చేయాలంటే క్షేత్రస్థాయి రంగంలోకి దిగి జగన్ లేని లోటును తీర్చుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక వరమే.
* అధినేత ఎంత చెబితే అంత..
అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) వై నాట్ 175 అనేసరికి.. అది ఎలా సాధ్యమో గుర్తించలేదు. గ్రామస్థాయి లో చిన్న పార్టీ నేతలు సైతం అదే స్లోగన్ తో ముందుకెళ్లారు. ప్రజలు దారుణంగా ఓడించినా.. వచ్చే ఎన్నికల్లో మాదే విజయం అంటూ ఇప్పటికీ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు బెంగళూరు నుంచి తాడేపల్లి కి చేరుకున్నారు జగన్. ప్రతి మంగళవారం వచ్చి మూడు రోజుల పాటు ఉండి.. బెంగళూరు వెళ్ళిపోతుంటారు జగన్. మొన్న మంగళవారం వస్తానని భావించారు కానీ విమానాలు రద్దు అయ్యాయి. ఇప్పుడు విమానాల పునరుద్ధరణ జరగడంతో బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్నారు జగన్. తమకు అలవాటైన విద్యగా ఉన్న ఘనస్వాగతంతో వందలాదిమంది జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి కి తీసుకెళ్లారు. తుఫాను పరిస్థితులను, వరద బాధితుల వివరాలను ఆయన చేతిలో పెట్టారు. ఆయన ఇక తన సానుభూతి మాటలను బయట పెట్టేందుకు సిద్ధపడతారన్నమాట.
* తీరుబాటుగా బాధితుల వద్దకు..
తుఫాన్ హెచ్చరికల నాటి నుంచి ఏపీ ప్రభుత్వం( AP government) అప్రమత్తమయింది. చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపారు. సహాయక చర్యలకు గాను ముందస్తుగానే జిల్లాకు కోటి రూపాయలు మంజూరు చేశారు. రెండు రోజులపాటు సచివాలయంలో ఉండి పర్యవేక్షించారు. అర్ధరాత్రి వరకు అక్కడే గడిపారు. తుఫాన్ ముప్పు తప్పిన వెంటనే ఏరియల్ సర్వేకు దిగారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు అందించారు. నిత్యవసరాలు పంపిణీ చేశారు. అయితే ఇప్పుడు తీరుబాటుగా జగన్మోహన్ రెడ్డి వారి దగ్గరకు వెళ్తారు. అదే నేను సీఎంగా ఉంటేనా ఇంతకుమించి సాయం చేసే వాడినని చెబుతారు. ప్రజల్లో సానుభూతి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన లోటు ఏమి ఉండదు. అయితే అన్నివేళలా ఈ సానుభూతి పనిచేస్తుందనుకోవడం కూడా పొరపాటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మూడు ఎన్నికలను ఎదుర్కొన్నారు. కానీ గెలిచింది ఒకసారి మాత్రమే.