Homeటాప్ స్టోరీస్KTR Padayatra : కేటీఆర్ పాదయాత్ర.. తెలంగాణ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ అవుతుందా..

KTR Padayatra : కేటీఆర్ పాదయాత్ర.. తెలంగాణ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ అవుతుందా..

KTR Padayatra : తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ వ్యాక్యూమ్ అంతగా కనిపించడం లేదు. అలాగని భవిష్యత్ కాలంలో ఏర్పడదు అని చెప్పడానికి లేదు. రాజకీయాలు స్థిరంగా ఉండవు. స్థిరంగా ఉంటే వాటిని రాజకీయాలు అనరు. ఏదో ఒక విధమైన సంఘటన చోటు చేసుకుంటూనే ఉంటుంది. దాని వెనుక కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది. తనకు అనుకూలంగా దానిని మార్చుకుంటారు. మలచుకుంటారు. ఆ తర్వాత ఏదైనా చేస్తారు. అంతిమంగా అధికారం మాత్రమే కావాలి కాబట్టి.. అధికారం దక్కే విధంగా తాపత్రయ పడుతుంటారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఊహించని ఫలితాలు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో అయితే మరింత దారుణంగా ఫలితాలు వచ్చాయి. ఇక 2025లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి దిమ్మతిరిగే విధంగా ఫలితాలు వచ్చాయి. రెండు పర్యాయాలు అధికారంలో ఉండడం.. ఉద్యమ పార్టీ హోదాను అనుభవిస్తున్న భారత రాష్ట్ర సమితికి ఈ ఫలితాలు ఏమంత గొప్పవి కావు. పైగా పరిపాలనకు రెఫరండం అని గులాబీ పార్టీ చెప్పిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది.

క్షేత్రస్థాయిలో ఇన్ని పరిణామాలు వ్యతిరేకంగా కనిపిస్తున్న నేపథ్యంలో కచ్చితంగా గులాబీ పార్టీ బౌన్స్ బ్యాక్ కావాలి. అలా అయితేనే శ్రేణులకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఈ క్రమంలో గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు క్షేత్రస్థాయిలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి కేటీఆర్ ఫీల్డ్ లెవల్ లోనే ఎక్కువగా ఉన్నారు. కాకపోతే అవి సభలకు, సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే ఈసారి అలా కాకుండా ఏకంగా పాదయాత్ర చేపట్టాలని కేటీఆర్ డిసైడ్ అయ్యారు.

కేటీఆర్ చేపట్టే పాదయాత్ర అత్యంత చారిత్రాత్మకంగా ఉండాలని నిర్ణయించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్…. చంద్రబాబు.. పాదయాత్ర చేపట్టారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జగన్, రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. షర్మిల కూడా పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో వారంతా చేపట్టిన పాదయాత్రలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నాటి రోజుల్లో చోటు చేసుకున్న పరిస్థితులను.. ఇప్పటి పరిస్థితులను బేరిజు వేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన సాగు నీరు.. ప్రభుత్వ ఉద్యోగాలు.. పడిపోయిన రియల్ ఎస్టేట్.. ఇతర సమస్యలను ప్రధాన అస్త్రాలుగా ప్రస్తావిస్తూ కేటీఆర్ పాదయాత్ర చేస్తారని సమాచారం.

ఇప్పటికే అనేక సందర్భాలలో తన పాదయాత్ర గురించి కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. పాదయాత్ర చేస్తేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం సాధ్యమని ఒక అభిప్రాయం స్థిరపడిపోయింది. 2023 ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. నాడు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేటీఆర్.. కీలక నాయకులు కేటీఆర్, హరీష్ రావు సొంత నియోజకవర్గాలలో భారీ ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించారు.. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ చేపట్టిన పాదయాత్ర వల్ల అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆయన ఒక బలమైన కారణమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచి బయటికి రావడం లేదు. ఒకప్పటి రోజులు కూడా ఇప్పుడు కావు. నాయకుడు ఎంతగా ప్రజల్లో ఉంటే అంత మంచిది.

కేటీఆర్ కెసిఆర్ ఉన్నంతవరకు ప్రత్యామ్నాయ సారధి కాలేరు. అలాంటప్పుడు జనాలలో ఒక నమ్మకం కలిగించాలి అంటే కచ్చితంగా కేటీఆర్ ఏదో ఒకటి చేయాలి. అందువల్లే ఆయన పాదయాత్రను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధమైందని సమాచారం. ఇటీవల కాలంలో కేటీఆర్ బరువు చాలా వరకు తగ్గిపోయారు. వ్యక్తిగత ఆరోగ్యం మీద తీవ్రంగా దృష్టి పెడుతున్నారు. అందువల్లే ఆయన పాదయాత్రకు సిద్ధమనే సంకేతాలు పంపించినట్లు సమాచారం. ఒకసారి పాదయాత్ర మొదలైతే మధ్యలో ఆపడానికి కుదరదు. అందువల్లే పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాతే పాదయాత్రను మొదలు పెడతారు. ఒకవేళ కేటీఆర్ నిర్ణయించుకున్న కార్యక్రమం పూర్తయితే.. 2028 లో జరిగే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందా.. ఒకవేళ కేటీఆర్ కు పోటీగా కవిత పాదయాత్ర చేస్తే.. అప్పుడు తెలంగాణ రాజకీయాలు మరింత హాట్ గా మారతాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular