Visakhapatnam Google data center : విశాఖ( Visakhapatnam) ఇక విశ్వనగరం. ఓ చారిత్రక ఘట్టంతో ప్రపంచం చూపు విశాఖ పై పడనుంది. మరికొద్ది సమయంలో సాగరనగరంలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్కు నేడు పునాది పడబోతోంది. గ్లోబల్ టెక్ మ్యాపు పై విశాఖ నగరం ప్రత్యేక గుర్తింపు సాధించనుంది. ఇప్పటివరకు విశాఖను పోర్టు సిటీగాను, ఉక్కు నగరం గాను చూశారు. దానిని దాటి డేటా సిటీగా మారబోతోంది సాగరనగరం. ఒక్క విశాఖ మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర సైతం ఈ విషయంలో ప్రత్యేక గుర్తింపు పొందనుందన్నమాట.
* ఆసియాలోనే అతి పెద్దది..
ఆసియాలోనే( Asia ) అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ గా ఇది నిలవనుంది. రాష్ట్ర భవిష్యత్తును ఇది మార్చనుంది. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నేడు భూమి పూజ చేయనున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గూగుల్ సంస్థ 1 గిగావాట్ కు పైగా సామర్థ్యం తో మూడు చోట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఈ డేటా సెంటర్ నిర్మాణానికి గాను తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.80 ఎకరాలను కేటాయించింది. ఈ మూడు డేటా సెంటర్లను 2028 నాటికి పూర్తి చేయాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.
* వాటి సరసన విశాఖ..
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఐటీ నగరాల జాబితాలో హైదరాబాద్( Hyderabad), బెంగళూరు, చెన్నై ఉన్నాయి. ఐటీ రంగాన్ని ఏలుతున్నాయి కూడా. అయితే ఆ జాబితాలో విశాఖ నగరం కూడా చేరనుంది. విశాఖ సముద్ర తీరంలో వేసి ఇంటర్నేషనల్ సబ్ సి కేబుళ్లతో వివిధ దేశాలతో అనుసంధానం ఏర్పడనుంది. విశాఖ ఆసియా ప్రాంతానికి గూగుల్ క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేట్ వే గా మారనుంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో దాదాపు 1.88 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఒక్క ఐటి కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సేవ రంగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి దోహద పడనుంది. రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత ఉద్యోగ మార్కెట్ కూడా విస్తరించనుంది.
* అనుబంధ పరిశ్రమలు..
గూగుల్ డేటా సెంటర్( Google data centre) ఏర్పాటుతో అనుబంధ పరిశ్రమలు కూడా విశాఖకు రానున్నాయి. వివిధ సంస్థలకు ఏఐ ఆధారిత కంప్యూటింగ్ సేవలందించే మౌలిక వసతులు, భారీ ఎత్తున డేటా స్టోరేజ్, అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ సదుపాయాలు వంటివి ఏర్పాటు కానున్నాయి. ఈ ఒక్క గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం అంతర్జాతీయ టెక్ సంస్థల ఫోకస్ ప్రారంభం కానుంది. డేటా సెంటర్ చుట్టూ అనుబంధ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పవర్, కూలింగ్, నెట్వర్కింగ్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. విశాఖలో సమగ్ర ఏఐ ఎకో సిస్టం ఏర్పడనుంది. గ్రీన్ ఎనర్జీ ఆధారంగా డేటా సెంటర్లను నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే విశాఖ విశ్వ నగరంగా ఎదగాలన్న లక్ష్యానికి ఈ ప్రాజెక్టు కీలకం. గ్లోబల్ టెక్ హబ్ గా రాష్ట్రాన్ని నిలబెట్టే దిశగా ఇది నిలవనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్, స్టార్టప్ రంగాల్లో అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి.
