Homeఉద్యోగాలుNEET 2026 : తండ్రి కిరాణ షాపు.. ముగ్గురు తోబుట్టువులు ‘నీట్’లో ర్యాంకులు..

NEET 2026 : తండ్రి కిరాణ షాపు.. ముగ్గురు తోబుట్టువులు ‘నీట్’లో ర్యాంకులు..

NEET 2026: బలమైన సంకల్పం.. కష్టపడి చదవాలనే తపన ఉంటే ఆర్థిక ఇబ్బందులు కూడా విజయాన్ని అడ్డుకోలేవని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు నిరూపించారు. చిన్న కిరాణా దుకాణం నడిపే తండ్రి ఖరీదైన కోచింగ్ ఇప్పించలేకపోయినా.. సాధారణ కోచింగ్‌తో పాటు స్వీయ కృషిని నమ్ముకున్న ఇద్దరు సోదరులు, ఓ సోదరి జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష NEETలో అద్భుతమైన ర్యాంకులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. చదువుపై కోరిక ఉంటే ఏ పరిస్థితులైనా అడ్డు రావు అని నిరూపించిన వీరిని దేశ వ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అనుకునే యువతకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

బిహార్ రాష్ట్రంలోని సహర్సా జిల్లాలో రోహిత్ ఆనంద్, పూనమ్ దేవీ దంపతులు చిన్న కిరాణం దుకాణం నడుతున్నారు. వీరికి కుమారులు రజ్‌నీశ్, ప్రహ్లాద్.. కూతురు సాక్షి సంతానం. అయితే పరిమిత ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తండ్రికి పిల్లలను పెద్ద నగరాల్లోని ఖరీదైన కోచింగ్ సెంటర్లలో చేర్పించడం సాధ్యం కాలేదు. అయినప్పటికీ వారి చదువుకు అన్ని రకాలుగా సహకరిస్తానని తండ్రి మాట ఇచ్చాడు. తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్న వీరు అందుబాటులో ఉన్న వనరులతోనే చదువును కొనసాగించారు.

అయితే స్థానికంగా అందుబాటులో ఉన్న సాధారణ కోచింగ్‌లో చేరిన ముగ్గురు విద్యార్థులు, మిగిలిన సమయాన్ని పూర్తిగా స్వయంగా చదవడానికి వినియోగించారు. ప్రతి రోజు ప్రణాళిక ప్రకారం చదవడం, మాక్ టెస్టులు రాయడం, బలహీనమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా NEET పరీక్షకు సిద్ధమయ్యారు. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో రజనీష్ కుమార్ 3,122 అఖిల భారత ర్యాంకు సాధించాడు. ప్రహ్లాద్ కుమార్ ఏఐఆర్ 26,751 ర్యాంకు రాగా.. సాక్షి కుమారి ఏఐఆర్ 9,672 ర్యాంకు సాధించింది. ఇప్పుడు ఈ ముగ్గురూ వైద్య విద్యను అభ్యసించేందుకు సిద్ధమయ్యారు.

తమ విజయానికి ప్రధాన కారణం కలిసి చదవడమేనని రజ్‌నీశ్, ప్రహ్లాద్, సాక్షి తెలిపారు. కఠినమైన ప్రశ్నలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకోవడం, సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవడం, ప్రతి సబ్జెక్టును విశ్లేషించడం వల్ల క్లిష్టమైన అంశాలు కూడా సులభంగా అర్థమయ్యాయని చెప్పారు. పరస్పరం ప్రోత్సహించుకోవడం వల్ల చదువుపై ఆసక్తి మరింత పెరిగిందని పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి చదివించారని, వారి శ్రమ వృథా కాకూడదనే ఉద్దేశంతో మరింత కష్టపడి చదివామని ముగ్గురు తెలిపారు. కుటుంబ పరిస్థితులు ఎప్పుడూ తమ లక్ష్యానికి అడ్డంకి కాలేదని, విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే చాలని చెప్పారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు ఒకేసారి NEETలో విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీరి విజయాన్ని చూసి గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ లక్ష్యంపై దృష్టి నిలిపితే ఏ పరీక్షలోనైనా విజయం సాధించవచ్చని ఈ ముగ్గురు సోదరులు నిరూపించారు.

ఈ విజయం కేవలం ఒక కుటుంబానిదే కాదు.. లక్ష్య సాధన కోసం పోరాడుతున్న లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. ఖరీదైన కోచింగ్ మాత్రమే విజయానికి మార్గం కాదని, కష్టపడి చదవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, పరస్పర సహకారం ఉంటే అత్యున్నత లక్ష్యాలను కూడా చేరుకోవచ్చని ఈ ముగ్గురు తోబుట్టువుల విజయం మరోసారి స్పష్టం చేసింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version