Vallabhaneni Vamsi : సామాన్యుడికి కేసులు, కోర్టులు అంటే భయం. ఎందుకంటే మంచి భవిష్యత్తు పోతుంది.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ రాజకీయ పార్టీల నేతలకు అలా కాదు. వారికి కేసులు అనేవి కామన్. జైలు జీవితం అనేది సర్వసాధారణం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పరారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.. ఓ కేసు విషయంలో ఆయనకు అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది. తన కార్యాలయం వద్ద ఆందోళన చేసిన టిడిపి కార్యకర్త పై దాడి చేశారన్న ఫిర్యాదు పై ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడు ఆయనతో పాటు అనుచరులు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎంత నిజం ఉందో చూడాలి.
* అత్యంత వివాదాస్పదుడిగా..
2019లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు వల్లభనేని వంశీ మోహన్. ఆ సమయంలో ఆయన కేవలం చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకు పడడానికే అన్నట్టు ఉండేవారు. కేవలం దానికోసమే ఆయనను వైసీపీలోకి రప్పించినట్లు అప్పట్లో వ్యవహారం నడిచేది. నోటికి ఎంత వస్తే అంత మాట అనేవారు వల్లభనేని వంశీ మోహన్. ఒకానొక దశలో చంద్రబాబు సతీమణి కోసం కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు లోకేష్. రెడ్ బుక్ లో అందరి పేర్లు రాస్తున్నానని.. తప్పకుండా అందరిపై చర్యలు ఉంటాయని అప్పట్లో హెచ్చరించారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వల్లభనేని వంశీ మోహన్ విషయంలో పెద్దగా కలుగ చేసుకోలేదు. అయితే వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి జరిగింది. అప్పటి కేసును ఉపసంహరించుకోవాలని కోరుతూ కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ పై ఒత్తిడి చేశారు వల్లభనేని వంశీ మోహన్. బాధితుడు ఫిర్యాదుతో ఆ కేసు మళ్లీ మొదలైంది. అలా ఒక్కో కేసు వల్లభనేని వంశీ మోహన్ మెడకు చుట్టుకుంది. దాదాపు 5 నెలలకు పైగా రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు వల్లభనేని వంశీ మోహన్. పలుమార్లు జైలులో అస్వస్థతకు కూడా గురయ్యారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవల రాజకీయ పరామర్శలు చేస్తున్నారు. పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు.
* చాలా రోజుల కిందట ఘటనపై..
అయితే ఇప్పుడు మరోసారి వల్లభనేని వంశీ అరెస్ట్ జరుగుతుందని ప్రచారం నడిచింది. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో తెలుగుదేశం పార్టీ ఒక నిరసన కార్యక్రమం చేసింది. వల్లభనేని వంశీ మోహన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఓ టిడిపి కార్యకర్తపై అనుచరులతో దాడి చేయించారన్నది ఆయనపై వచ్చిన అభియోగం. ఎప్పుడో నెలల కిందట వచ్చిన ఫిర్యాదు పై ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు సిద్ధపడ్డారు. దీంతో వల్లభనేని వంశీ మోహన్ తో పాటు ఆయన అనుచరులు కనిపించకుండా మానేశారు. అప్పటినుంచి వల్లభనేని వంశీ మోహన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన ముందస్తు బెయిల్ కోసం అలా చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకసారి కేసులు ఎదుర్కొని బెయిల్ పై బయటకు వచ్చాక అంత ఈజీగా మళ్లీ జీవితం ఉండదని చెబుతున్నారు. ఎందుకంటే అంతకు ముందు కేసుల్లో బెయిల్ తీర్పులను ఆధారంగా చేసుకుని న్యాయపరంగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కేవలం కోర్టు నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తారే తప్ప అజ్ఞాతంలోకి వెళ్లారన్నది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.