Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్Nadendla Manohar: ముఖ్యమంత్రిలో పాలన దక్షత లేకే నిరుద్యోగం.. నాదెండ్ల మనోహర్

Nadendla Manohar: ముఖ్యమంత్రిలో పాలన దక్షత లేకే నిరుద్యోగం.. నాదెండ్ల మనోహర్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో పాలన దక్షత, నిజాయతీ ఉంటే ఈ రెండేళ్లలో దాదాపు ఐదు నుంచి 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేవారని, ఆయనలో చిత్తశుద్ది లేదు కాబట్టే పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ రాష్ట్రానికి రావడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. అధికారంలో ఉన్న నాయకులు అహంకారం చూపిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. యువత, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రికి త్వరలోనే ప్రజలు బలంగా బుద్ధి చెబుతారన్నారు. శ్రీకాకుళం జిల్లా జనసేన శ్రేణులతో సోమవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “శ్రీకాకుళం జిల్లా విప్లవాలకు పురిటిగడ్డ. ఈ ప్రాంతం కోసం ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేశారు. గౌతు లచ్చన్న వంటి గొప్ప నాయకులు ఈ ప్రాంతానికి సేవలందించారు. అంతటి గొప్ప ప్రాంతం కాబట్టే మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గంగమ్మ తల్లికి పూజలు చేసి ఇక్కడ నుంచే పోరాటయాత్రను ప్రారంభించారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన నాయకులు రోడ్లు, కాలేజీలు గురించి అడిగేవారు.. మరి ఇప్పటి నాయకులు ఏమడుగుతున్నారో మనందరికీ తెలుసు. వారి ఆస్తులు పెంచుకోవడానికి.. వ్యాపారాలు చేసుకోవడానికి వీలైనవి, మైనింగ్ క్వారీలు అడుగుతున్నారు.

* దమ్ము, ధైర్యం ఉంటే ఇప్పుడు చేయాలి పాదయాత్ర
యువకుడు ముఖ్యమంత్రి అయితే జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మి జగన్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారు. గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. పరిశ్రమలు లేవు, పెట్టుబడులు రాలేదు. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. మాట తప్పను.. మడం తిప్పను అని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి గారు.. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఏమైయ్యాయో ఒక్కసారి చెప్పాలి. అధికారంలోకి రాగానే ఇస్తానన్న మూడు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలి. రోడ్ల అధ్వాన్న పరిస్థితులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలియాలంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేయాలి పాదయాత్ర. రోడ్ల నిర్మాణం కోసం రూ. 14 వేల కోట్లు ఖర్చు చేశాం, మరమ్మతుల కోసం మరో రూ.2 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోంది… కానీ క్షేత్రస్థాయిలో తట్టడు మట్టి వేసిన దాఖలాల కనిపించడం లేదు. అందుకే అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక రోడ్డును ఎంపిక చేసుకొని శ్రమదానం కార్యక్రమం ద్వారా రోడ్డు మరమ్మతు పనులు చేపడతాం. ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు.
* మత్స్యకారుల మధ్య చిచ్చు పెడుతున్నారు
శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రకృతి వనరులు ఉన్నాయి. వందల కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. లక్షలాది మంది మత్స్యకారులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి మత్స్యకారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ గెలిచాక ఆ హామీలను ఆటకెక్కించారు. మత్స్యకారుల ఓట్లతో గెలిచిన ఆయన .. ఇవాళ మత్స్యకారుల మధ్యే చిచ్చు పెట్టే జీవోలను తీసుకొస్తున్నారు. చిన్న చిన్న సమస్యలను కావాలనే స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. జీవో నెం. 217 గురించి తెలిసీ అందరూ ఆశ్చర్యపోతున్నారు. బీసీల్లో కూడా కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలను పెంచుతున్నారు. ఇన్ని కార్పొరేషన్లు గతంలో ఎన్నడైనా మనం చూశామా?
* కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడికి పోయాయి?
కరోనా మహమ్మారి ఏ విధంగా మన జీవితాలను కబళించిందో మనందరికీ తెలుసు. కళ్ల ముందరే సొంత మనుషులను కోల్పోయాం. లక్షలు వెచ్చించినా ప్రాణాలు కాపాడలేకపోయాం. ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. కరోనా కష్టసమయంలో కేంద్రం నుంచి దాదాపు రూ. 14 వందల కోట్ల నిధులు రిలీజ్ అయితే అవి ఏ విధంగా ఖర్చు చేశారో ఎవరికీ తెలియదు. దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వ్యక్తి పాలన ఇలాగేనా ఉండేది? 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. సినిమా టికెట్లు అమ్ముకోవడం, మటన్ షాపులు ఏర్పాటు చేయడం వంటి వాటిపై ఉన్న శ్రద్ధ ఈ ముఖ్యమంత్రికి ప్రజాసమస్యలపై లేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వాళ్లే బలంగా సమాధానం చెబుతారు.
* ఇసుక కొరత ప్రభుత్వ కుట్రే :
ఈ ప్రభుత్వం కుట్రతో కుత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టింది. ఇసుక కొరతపై జనసేన పార్టీ చేపట్టిన ర్యాలీ జరిగి కూడా రెండేళ్లు అవుతోంది. ఇప్పటికీ కూడా ఇసుక కొరత వేధిస్తోంది. నిర్మాణాలు చేపట్టాలంటే ఇసుక కోసం ప్రభుత్వ పెద్దలను బతిమిలాడుకోవలసిన పరిస్థితి దాపురించింది. రూ. 18 వందలకు దొరికే ఇసుక ఇవాళ రూ. 20 వేలు దాటిపోయింది. ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రజలే అర్ధం చేసుకోవాలి. మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చాలా తొందరగా జరుగుతోంది. ఇప్పటికే 9 జిల్లాల్లో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశాం. వాటిలో యువత, మహిళలకు పెద్దపీట వేశాం. గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటే జనసేన పార్టీ బలమైన శక్తిగా అవతరిస్తుంది. జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలంటే మనందరం సమిష్టిగా కష్టపడితేనే అది సాధ్యమవుతుందని” అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, కార్యదర్శులు శ్రీ గడసాల అప్పారావు, శ్రీ బోడపాటి శివదత్, అధికార ప్రతినిధులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పరుచూరి భాస్కరరావు, శ్రీమతి సుజాత పండా, శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు శ్రీ గేదెల చైతన్య, శ్రీ కోరాడ సర్వేశ్వర రావు, శ్రీ కణితి కిరణ్, శ్రీమతి కాంతిశ్రీ, శ్రీ మెట్ట వైకుంఠ రావు, శ్రీ విశ్వక్షేన్, భీమిలి ఇంచార్జి శ్రీ పంచకర్ల సందీప్, చోడవరం ఇంచార్జి శ్రీ పి.వి.ఎస్.ఎన్.రాజు అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
* దారి పొడవునా పూలవర్షంతో స్వాగతం
విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు బయలుదేరిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి విజయగనరం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. రహదారి పొడుగునా మంగళహారతులు పట్టి, పూల వర్షం కురిపించారు. విజయనగరం జిల్లాల్లో అడుగు పెట్టిన వెంటనే స్థానిక నాతవలస చెక్ పోస్టు వద్ద పెద్ద సంఖ్యలో జనసేన శ్రేణులు పూల వర్షంతో జిల్లాలోకి ఆహ్వానించారు. శ్రీ మనోహర్ గారికి పూల మాలలు వేశారు. పార్టీ శ్రేణుల నినాదాలు, భారీ ర్యాలీ మధ్య ఆయన ముందుకు సాగారు. శ్రీ మనోహర్ గారు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా పూసపాటిరేగలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో అత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు శ్రీ మనోహర్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం దగ్గర పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రణస్థలం, శ్రీకాకుళంలలో డప్పు వాద్యాలు, బాణాసంచా కాల్చి ఆయనకు ఆహ్వానం పలికారు. వందల సంఖ్యలో యువకులు బైకులు, కార్లతో ర్యాలీగా అనుసరించారు.
* శ్రీ పెడాడ రామ్మోహనరావుకి పరామర్శ
రహదారుల దుస్థితిపై జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సోషల్ మీడియాలో ఆమదాలవలస నియోజకవర్గంలో రోడ్లు పరిస్థితిని తెలియజేసి అనంతరం వాటిని ఫ్లెక్సీ రూపంలో ముద్రించిన ఆ నియోజకవర్గ జనసేన నాయకుడు శ్రీ పెడాడ రామ్మోహన్ రావుపై అధికార పార్టీ వ్యక్తులు ఇటీవల దాడికి పాల్పడ్డారు. ఆయనతోపాటు మరో ఏడుగురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని సోమవారం మధ్యాహ్నం ఆమదాలవలసలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పరామర్శించి ధైర్యం చెప్పారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version