Donald Trump : అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ తన ఏడాది పాలనలో ఏనాడూ భారత్‌కు సాయం చేయలేదు. కనీసం ఉపయోగపడలేదు. భారతే కాదు ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. టారిఫ్‌ల పేరుతో ప్రపంచదేశాల ఎగుమతులపై ఆంక్షలు విధించారు. భారత్‌పై 25 శాతం టారిఫ్ విధించిన ట్రంప్.. తర్వాత రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేస్తుందన్న సాకుతో మరో 25 శాతం సుంకాలు విధించారు. ఆయిల్ కొనుగోలు నిలిపివేస్తే 25 శాతం టారిఫ్ ఎత్తేస్తామన్నారు. కానీ, మనకు కీలక భాగస్వామి అయిన రష్యాకు భారత్ అండగా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మళ్లీ భారం తప్పదు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను మరింత ఎక్కువ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 50 శాతం వరకు డయూటీలు విధించారు. ఆయిల్ దిగుమతులు ఆపకపోతే మరోసారి పెంపు ఖాయమని హెచ్చరించారు. ఈ నిర్ణయం భారత వాణిజ్యానికి పెద్ద దెబ్బ తీసుకొస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మోదీ మంచి వ్యక్తి..
ప్రధాని నరేంద్ర మోదీ మంచి వ్యక్తి అని.. టారిఫ్‌ల పెంపు విషయం అతనికి తెలుసు అన్నారు. భారత్‌కు నన్ను సంతృప్తి పర్చడం చాలా ముఖ్యం అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఆంక్షలను భారత్ పాటించాలని పరోక్షంగా హెచ్చరించారు. భారత్ రష్యన్ చమురును ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి చేస్తోంది, ఇది అమెరికా అసంతృప్తికి కారణమవుతోంది.
ఈ టారిఫ్ పెంపు భారత ఎగుమతులైన ఐటీ సేవలు, ఔషధాలు, టెక్స్‌టైల్స్‌పై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే యూఎస్–భారత వాణిజ్య ఒప్పందాలు చర్చలో ఉన్న నేపథ్యంలో, ఈ హెచ్చరిక రెండు దేశాల మధ్య సంబంధాలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో అని వ్యాపార వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.