budget SUVs in India : కారు కొనాలంటే కొనుగోలుదారు ముందుగా చూసేది మైలేజ్. ఎంత మైలేజీ ఇస్తుంది, పెట్రోల్ వెర్షనా,, డీజిల్ వెర్షనా.. సీఎన్‌జీనా అని చూస్తాడు. తర్వాత చూసేది స్పేస్. ఎంత కెపాసిటీ, ఎన్ని సీట్లు ఉన్నాయి. లగేజీ స్పేస్ ఎంత అని ఆరా తీస్తాడు. ఇక తర్వాత చూసేది ధర. బడ్జెట్‌లో ఉందా.. ఎక్కువ ఉందా అని తెలుసుకుంటారు. ఇలా ప్లాన్ చేసిన తర్వాతనే కారు కొంటారు. ఇలా కారు కొనుగోలు ప్లాన్‌లో ఉన్నవారికి ఫ్యామిలీ ట్రిప్‌లకు అద్భుత బూట్ స్పేస్, మైలేజీ ఉన్న టాప్ 5 కార్లు ఇవీ. విశాల క్యాబిన్, లగేజీ స్థలంతో పండుగలు, వీకెండ్ టూర్లకు సరైన ఎంపికలు.
టాటా కర్వ్
టాటా మోటార్స్ తయారు చేసిన ఈ కారు సరికొత్త ఎస్‌యూవీ కూపే డిజైనర్ కారు. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, ప్రయాణికులకు కావలసినంత స్థలాన్ని అందిస్తుంది. ఇందులో ప్రధాన ఆకర్షణ దీని బూట్ స్పేస్(డిక్కీ స్థలం). దాదాపు 500 లీటర్ల సామర్థ్యం స్పేస్ ఉంటుంది. ఇక కారు లోపల ఐదుగురు ప్రయాణికులు సులభంగా, సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇది పెట్రోల్, డీజిల్ రెండింటిలోనూ లభిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్–షోరూమ్ ధర రూ.9.65 లక్షల నుంచి మొదలవుతుంది. స్టైల్, స్పేస్ రెండూ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
సిట్రోయెన్ బసాల్ట్
ఫ్రెంచ్ ఆటో మేకర్ సిట్రోయెన్ నుంచి వచ్చిన ’బసాల్ట్’ కూడా ఎస్‌యూవీ కూపే సెగ్మెంట్లో గట్టి పోటీ ఇస్తుంది. ఈ కారులో 470 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. దీని లోపలి క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది, వెనుక కూర్చునే ప్రయాణికులకు కాళ్ల దగ్గర స్థలం ఎక్కువగా ఉంటుంది. నలుగురైదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా గంటలతరబడి ప్రయాణించవచ్చు. ఇది 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో దొరుకుతుంది. కేవలం రూ.8.55 లక్షల ప్రారంభ ధరతో ఇది ఒక గొప్ప ఫ్యామిలీ ఎస్‌యూవీగా నిలుస్తోంది.
టాటా సియెర్రా..
టాటా కంపెనీ నుంచి వచ్చిన మరో వర్షన్ పాత తరం వారికి పరిచయం ఉన్న కారు. ఇప్పుడు దాన్ని సరికొత్తగా, మరింత విశాలంగా టాటా కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ విభాగంలోనే అత్యధికంగా 600 లీటర్ల భారీ బూట్ స్పేస్ కలిగిన కారు ఇదే. పెద్ద కుటుంబాలు, ఎక్కువ సామాన్లతో ప్రయాణించే వారికి సియెర్రా ఒక వరమనే చెప్పాలి. క్యాబిన్ లోపల కూడా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఐదుగురు వ్యక్తులు చాలా లగ్జరీగా కూర్చోవచ్చు. పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో అందుబాటులో ఉన్న ఈ కారు ప్రారంభ ధర రూ.11.49 లక్షలు. లాంగ్ జర్నీలు పర్ఫెక్ట్ కారు.
హోండా ఎలివేట్..
హోండా కంపెనీకి ఉన్న నమ్మకమే ఈ కారుకు అతిపెద్ద బలం. హోండా ఎలివేట్ కారులో 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవేలపైనూ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక ఇందులో 458 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీని క్యాబిన్ డిజైన్ చాలా తెలివిగా చేశారు. ఎత్తు ఉన్నవారు కూడా హాయిగా కూర్చోవచ్చు. దీని ప్రారంభ ధర రూ.11.59 లక్షలుగా ఉంది.
ఎంజీ హెక్టర్..
భారతీయ మార్కెట్లో ఫీచర్ల రారాజుగా పేరున్న ఎంజీ హెక్టర్, స్పేస్ విషయంలోనూ తగ్గేదేలే అంటోంది. ఇందులో 587 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లినా సామాన్ల కోసం అదనంగా ఆలోచించాల్సిన పనే ఉండదు. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కారు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్‌లతో వస్తుంది. ఐదుగురు ప్రయాణించే సామర్థం ఉంది. ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు. లగ్జరీ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్.