AP Survey: ఎన్నికల ముంగిట సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ఫలితాలను ప్రకటిస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థలతో పాటు సర్వే ఏజెన్సీలు రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా ఏపీలో పీపుల్ రైట్స్ సర్వే సంస్థ ఫలితాలను ప్రకటించింది. మార్చి నెలలో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సర్వే చేసినట్లు సంబంధిత సంస్థ చెబుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన మెజారిటీ సర్వేల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. తాజా సర్వే సంస్థ సైతం పారదర్శకంగా తాము సర్వే చేపట్టినట్లు చెబుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీలదే విజయం అని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు గాను వైసిపి ఒంటరి పోరాటం చేస్తోంది. మరోవైపు బిజెపి, జనసేనతో టిడిపి జతకట్టింది. ఆ మూడు పార్టీలు కూటమి కట్టాయి. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ సీట్లు, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో బరిలో దిగనుంది. బిజెపి 10 అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిగా పోటీ చేయనున్నాయి. లోక్సత్తా ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది. మిగతా చిన్న చిన్న పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి.
ఈ పరిణామాల క్రమంలో తాజాగా పీపుల్ రైట్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఏపీలో కూటమి ఘన విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది. 175 నియోజకవర్గాలకు గాను కూటమి 156 స్థానాల్లో గెలుపొందుతుందని ప్రకటించింది. వైసీపీకి దారుణ ఓటమి ఎదురుకానుందని తేల్చింది. రెండు రోజుల కిందట మన్మత్ సంస్థ సర్వేలో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కుతుందని తేలింది. అది జరిగిన 48 గంటలు గడవక ముందే పీపుల్ రైట్స్ సంస్థ కూటమికి ఏకపక్ష విజయం కట్టబెట్టడం విశేషం. అటు రాజకీయ పార్టీలు సైతం తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే ఆహ్వానిస్తున్నారు. లేకుంటే ఫేక్ గా తేల్చేస్తున్నారు.