Adilabad : ఆ పెద్దపులి ఆనవాళ్లు ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అడవుల్లో కనిపించాయి. ఆ అడవిలో అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అందులో పెద్దపులి సంచరిస్తున్న ఆనవాళ్లు రికార్డయ్యాయి. అయితే ఆ పెద్దపులి ఆహార అన్వేషణ కోసం వచ్చిందని ముందుగా అటవీ శాఖ అధికారులు అనుకున్నారు. కానీ దాని గురించి లోతుగా అధ్యయనం చేస్తే ఒక ప్రేమ కథ బయటికి వచ్చింది. అదేంటి పెద్దపులి అడవుల్లో సంచరిస్తే ప్రేమ కథ బయటపడటం ఏంటి? అనే అనుమానం మీలో కలిగింది కదా.. మీకేంటి ఈ కథనం రాస్తున్న మాకు కూడా అలాంటి భావన కలిగింది. అయితే ఆ పెద్దపులి పేరు జానీ అట. అది తన లవర్ కోసం వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిందట. జానీ నివాసం ఉండేది మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో. అయితే గత నెలలో జానీ యుక్త వయసుకు వచ్చిందట. దాని శరీరంలో హార్మోన్లు ఆడ తోడు కోసం వెళ్లాలని దానిని ప్రేరేపించాయట. ఇంకేముంది తిప్పేశ్వర్ అడవిలో ఒక్క క్షణం కూడా జానీ ఉండలేకపోయాడు. వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. తనకు ఈడైన పులి కోసం తపించింది. ఎక్కడైనా తారసపడుతుందేమోనని చూసింది. కాని దాని ఎదురుచూపులు ఫలించలేదు. ఏకంగా వందల కిలోమీటర్లు నడిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెల్లి ప్రాంతంలోకి వచ్చింది. ఇక్కడ కూడా తనదైన జోడు కనిపించకపోవడంతో.. మళ్లీ మహారాష్ట్ర వెళ్ళింది. అక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ కావడంతో మళ్ళీ తెలంగాణకు వచ్చింది. రోజుకో మండలం తీరుగా తిరుగుతూనే ఉంది. ఇక ఈనెల 10న రాత్రిపూట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించింది. అందర్నీ కంగారు పెట్టించింది. ఇక మంగళవారం మామడ – పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దు పై దాడి చేసి చంపేసింది. ఇక ప్రస్తుతం అదే ప్రాంతంలో జానీ తిరుగుతోంది. తనకోజోడు కావాలని తపిస్తోంది. కాలికి బలపం కట్టుకుని అడవులు మొత్తం తిరిగినా ఉపయోగం లేకపోవడంతో మళ్లీ జానీ మహారాష్ట్ర వెళ్లే అవకాశాలు లేకపోలేదు.
పులులు కాస్త భిన్నమైనవి..
జానీ లవ్ స్టోరీ విన్న తర్వాత.. అటవీ శాఖ అధికారులు తమదైన అనుభవాలను చెబుతున్నారు. ” క్రూర జంతువులలో పులులది భిన్నమైన శైలి. అవి క్రాసింగ్ కు వచ్చినప్పుడు తమదైన జోడి కోసం తిరుగుతుంటాయి. ఒక్కో సందర్భంలో పచ్చి మంచినీరు కూడా ముట్టవు. ఇప్పుడు జానీ పరిస్థితి కూడా అదే. తనకు ఒక జోడు కోసం జానీ ఇప్పటివరకు 500 కిలోమీటర్ల దూరం నడిచిందట. నిర్మల్ – మహారాష్ట్ర మధ్యలో దట్టమైన అడవులు ఉన్నాయి. నీటి వనరులు కూడా ఉన్నాయి. వన్యప్రాణులు కూడా విస్తారంగా తిరుగుతుంటాయి. అందువల్లే జాని కూడా అటు ఇటు తిరుగుతోంది. అయితే జానీ ఎటువైపు వెళుతుందో గమనిస్తున్నాం. అన్ని ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నాం. పులి సంరక్షణ సంబంధించి సూచనలు కూడా చేస్తున్నామని” అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారం
భయాందోళనలో ప్రజలు. pic.twitter.com/Dw8DihRG7A
— Telugu Scribe (@TeluguScribe) November 15, 2024