
కరోనా రెండో దశ వ్యాప్తిని కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కడపలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభు్త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొవిడ్ కట్టడికి బడ్జెట్ లో సరిపడా నిధులు కేటాయించకపోవడాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి కరోనా కట్టడికి సూచనలు సలహాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.