NPS Vatsalya Scheme:చిన్నారులకు బంగారు భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పిఎస్ వాత్సల్య యోజనను ప్రారంభించారు. ఎన్‌పిఎస్ వాత్సల్య స్కీమ్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఎన్‌పిఎస్ వాత్సల్య అనేది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చిన్నప్పటి నుండి పెట్టుబడి పెట్టే పథకం. ఇక్కడ దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుంది. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే చక్రవడ్డీ కారణంగా పెట్టుబడిపై బహుళ రాబడి లభిస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. రిటైర్మెంట్ తర్వాత.. ఎన్ పీఎస్ ఫండ్ నుంచి ఒకేసారి 60 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని యాన్యుటీ స్కీమ్‌లలో కొనుగోలు చేయాలి. దీంతో పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బులు పొందవచ్చు.
తల్లిదండ్రులు లేదా సంరక్షకులు 18 ఏళ్లలోపు పిల్లల పేరిట ఈ వాత్సల్య ఖాతాను తీసుకోవచ్చు. కనీసం రూ. 1000తో ఖాతా తెరవవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ప్రధాన బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్‌లు లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ఇ-ఎన్‌పిఎస్‌లలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సంరక్షకుడు లేదా తల్లిదండ్రుల గుర్తింపు, చిరునామా రుజువు అవసరం. మైనర్ పుట్టిన తేదీ రుజువు అవసరం.
ఇది అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎన్‌పీఎస్ వాత్సల్యగా ఉంటుంది. అదే పిల్లలు మేజర్లుగా మారిన తర్వాత.. సాధారణ ఎన్ పీఎస్ ఖాతాగా కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా ఈ ఖాతాను కొనసాగించవచ్చు. పదవీ విరమణ వయస్సు వరకు ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మంచి ఆదాయం వస్తుంది. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దేశంలోని ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2004లో ఎన్‌పీఎస్ పథకాన్ని ప్రారంభించగా.. ఇక్కడ మంచి పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో గరిష్ట పెట్టుబడి రూ. 2 లక్షల వరకు పన్ను తగ్గించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్రాచుర్యం పొందిన ఈ పథకం ఇప్పుడు విస్తరించి చిన్న పిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చింది.
రూ.5వేలు పెడితే 65కోట్లు
మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండేలా కేంద్ర ప్రభుత్వం ‘ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని’ అమల్లోకి తెచ్చింది. 0-17 ఏళ్లలోపు పిల్లల పేరిట ఖాతా తెరవాలి. మీ పిల్లలకు ప్రతి నెలా రూ.5 వేలు పొదుపు చేస్తే సరిపోతుంది. బిడ్డకు 18 ఏళ్లు వచ్చినప్పుడు, వారు ఏటా 12శాతం రాబడితో రూ.40 లక్షలు అందుకుంటారు. మీరు 60 సంవత్సరాల వరకు పొదుపు చేస్తే రూ. 64.5 కోట్లు పొందవచ్చు.
* చిన్న వయస్సు నుండే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
* ఇందులో మీరు చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే.. ఏటా సంపద పెరుగుతూ ఉంటుంది.
* మీరు మైనర్‌గా ఉన్నప్పుడే ఈ వాత్సల్య పథకాన్ని ప్రారంభించడం ద్వారా పదవీ విరమణ నాటికి భారీ మొత్తంలో నిధులు పోగుపడతాయని చెప్పవచ్చు.
* చిన్న పిల్లలు పొదుపు చేయడం అలవాటు చేసుకోవచ్చు.