Jagan vs Chandrababu : ఏపీ విషయంలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఏపీలో కూటమికి ప్రత్యర్థిగా వైసిపి ఉంది. వైసిపి మాత్రం టిడిపి, జనసేన నే శత్రువుగా చూస్తోంది. బిజెపి విషయంలో భిన్న వైఖరితో ఉంది. ఆ పార్టీని ఏమీ అనడం లేదు కూడా. అందుకే జగన్ విషయంలో సైతం బిజెపి సానుకూలతతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే వివేకానంద రెడ్డి హత్య కేసు, కోడి కత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి కి కేంద్రం ఫేవర్ చేస్తుందన్న టాక్ కూడా ఉంది. అయితే గత అనుభవాల పుణ్యమా అని చంద్రబాబు కూడా గాబరా పడడం లేదు. కేంద్రంతో చిన్నపాటి గ్యాప్ కూడా తెచ్చుకోవడం లేదు. తప్పనిసరిగా జగన్ విషయంలో బిజెపి వైఖరి చంద్రబాబు ఆలోచన చేసి ఉంటారు. సరైన సమయం చూసి జగన్మోహన్ రెడ్డికి చెక్ చెబుతారు అన్న టాక్ ఉంది. అయితే అది ఆసన్నమైందని.. మద్యం కుంభకోణం కేసు ద్వారా బిజెపికి, జగన్కు మధ్య కటీఫ్ చెప్పబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
* చేతికి మట్టి అంటకుండా..
ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam) ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతిమ లబ్ధిదారుడు జగన్ అని.. ఆయనే అవినీతికి పాల్పడ్డారని టిడిపి కూటమినేతల ఆరోపిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం లోతైన విచారణ చేపడుతోందని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఓ ముగ్గురు కీలక వ్యక్తులకు ఈ కేసులో బెయిల్ వచ్చింది. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ప్రశ్నకు దారితీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపడితే అది రాజకీయ కోణంలోనే చేసారని అనుమానాలు ఉంటాయి. అందుకే చంద్రబాబు కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తోనే జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పాలని మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
* ఆ సానుభూతి దక్కకుండా..
మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) అరెస్ట్ ఉంటుందని ఎక్కువగా ప్రచారం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ నేతలు సైతం ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే ప్రజల్లోకి ఇది బలంగా వెళ్తుంది. అంతిమంగా మైనస్ చేస్తుందని చంద్రబాబుకు తెలుసు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ద్వారా ఆయనకు ప్రజల నుంచి సానుభూతి లభించింది. తన అరెస్టు ద్వారా ఎంత మైలేజ్ వచ్చిందో చంద్రబాబుకు తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి అరెస్టు జోలికి వెళ్లరన్నది ఒక ప్రచారం. అయితే కేంద్రం విషయంలో ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు ఆ బంధానికి బ్రేక్ వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. లేకుంటే ఇది ఎప్పటికైనా కష్టం అని ఒక అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది. తన చేతికి మట్టి అంటకుండా.. వైసీపీకి సానుభూతి రాకుండా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం.
* రేవంత్ మాదిరిగానే..
తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram projects ) అవినీతికి సంబంధించి దూమారం రేగింది. అక్కడ అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంది. విపక్షంగా బిఆర్ఎస్ కొనసాగుతోంది. అందుకే అక్కడి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు కేసును సిబిఐ కు అప్పగించారు. తద్వారా కెసిఆర్ భవిష్యత్తును బిజెపి చేతుల్లో పెట్టారు. ఇక్కడే ఒక ఫార్ములా బయటపడింది. బిజెపిలో బి ఆర్ఎస్ విలీనం.. ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పడం అనేది తెరపైకి రానుంది. రేవంత్ దానినే హైలెట్ చేయనున్నారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ విషయంలో సైతం చంద్రబాబు అదే ఫార్ములాను అనుసరించే అవకాశం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మద్యం కుంభకోణం కేసు అప్పగిస్తే.. జగన్మోహన్ రెడ్డి కి ఇబ్బందులు తప్పవు. అలాగని కేంద్రంలో ఉన్న బిజెపి ఏమాత్రం తేడా చూపితే.. అందుకు అనుగుణంగా చంద్రబాబు రాజకీయ అడుగులు వేసే అవకాశం ఉంది. మొత్తానికి అయితే చంద్రబాబు జగన్ విషయంలో మాస్టర్ ప్లాన్ తో ఉన్నట్లు అర్థమవుతుంది.