Revanth Reddy vs KTR : తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపరంగా కనివిని ఎరగని స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ప్రత్యర్ధులను కూడా అదే స్థాయిలో ఆడుకుంటున్నారు. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం.. గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న స్థానంలో మూడు రంగుల జెండాను ఎగరవేయడంతో అధిష్టానం రేవంత్ రెడ్డి స్థాయిని గుర్తించింది. అతడికి అన్ని విషయాలలో పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చింది. వచ్చిన అవకాశాలను రేవంత్ రెడ్డి సద్వినియోగం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా సాగింది. కేటీఆర్ విమర్శలు చేస్తే దానికి ప్రతిగా రేవంత్ రెడ్డి బదులిచ్చారు. ఒక రకంగా వీరిద్దరూ ఎన్నికల్లో పోటీ పడుతున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. నవీన్ యాదవ్ గెలుపును రేవంత్ రెడ్డి సవాల్గా తీసుకుంటే.. కేటీఆర్ సునీత గెలుపును ఛాలెంజ్ గా తీసుకున్నారు. అంతిమంగా మాత్రం రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ గెలుపు రూపంలో కేటీఆర్ మీద పై చేయి సాధించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ఆగడం లేదు.. పాలనపరంగా వేగంగా అడుగులు వేస్తున్న ఆయన.. మిగతా విషయాల్లో కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా తనకు కొరకరాని కొయ్యలాగా మారిపోయిన కేటీఆర్ విషయంలో రేవంత్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో రాజకీయంగా కక్ష సాధింపు లేదనే సంకేతాలు ఇవ్వడానికి రేవంత్ ఏకంగా గవర్నర్ ద్వారా నరుక్కుంటూ వచ్చారు..
ఫార్ములా ఈ కారు రేస్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా సంచలనం నమోదయింది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి గవర్నర్ విచారణకు గ్రీన్ సిగ్నన్ ఇచ్చారు. దీంతో ఏసిబి త్వరలో ఈ వ్యవహారంపై కేటీఆర్ కు వ్యతిరేకంగా అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఈ కేసు విచారణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. చివరికి ఇన్ని రోజులకు గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఈ కేసులో ఏ1 గా కేటీఆర్, ఏ2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు..