TANA CycloneRelief : తుఫాన్ విపత్తు కారణంగా ఆహారం, తాగునీరు వంటి మౌలిక అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్న వలస కుటుంబాలకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) చేయూతగా నిలిచింది. మచిలీపట్నం సమీపంలోని చిన్న కరగ్రహారం ప్రాంతంలో బాధిత కుటుంబాల కోసం తానా ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సేవా కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, కోశాధికారి రాజా కసుకుర్తి కీలక పాత్ర పోషించారు. వర్షాలు, గాలుల కారణంగా బయటకు రావడానికి వీల్లేక ఇళ్లలోనే చిక్కుకుపోయిన వలస కుటుంబాలు ఆకలితో తీవ్రంగా ఇబ్బందులు పడుతుండగా, తానా అందించిన భోజనం వారికి ఊరటనిచ్చింది.

“పిల్లలకు ఆహారం కూడా దొరకలేదు… తానా అందించిన భోజనం మాకు ప్రాణాధారం అయింది,” అని బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేశాయి.

ఈ సేవా కార్యక్రమాన్ని విజయవాడ హెల్పింగ్ హాండ్స్ సమన్వయపరిచింది. తానా ప్రతినిధులు వారి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతి సందర్భంలో మానవతా దృక్పథంతో ముందుకొచ్చి సహాయం అందించే తానా సంస్థ, ఈ సారి కూడా తన సేవా స్ఫూర్తిని చాటుకుంది. బాధిత కుటుంబాలకు ఆహారాన్ని మాత్రమే కాకుండా, ఆశ మరియు భరోసాను కూడా అందించింది.
