Homeలైఫ్ స్టైల్sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న విత్తనాలపై ఆసక్తి చూపుతున్నారు. కొన్నింటిలో అత్యధిక పోషకాలు ఉండడంతో వీటి కోసం ఆరాటపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సన్‌ఫ్లవర్ సీడ్స్ (Sunflower Seeds) గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది. సాధారణంగా సన్ ఫ్లవర్ ఆయల్ గురించి తెలుసు. కానీ వీటి విత్తనాలతో కూడా ఉపయోగాలున్నాయని కొందరు పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు. అసలు ఇందులో ఉండే పోషకాలు ఏంటీ? ఇవి ఆరోగ్యానికి ఏ రకంగా ఉపయోగపడుతాయి?

సన్‌ఫ్లవర్ గురించి చాలా సందర్భాల్లో చర్చించుకుంటాం. వీటి ద్వారా ప్రస్తుతం ఉపయోగిస్తున్న వంట నూనె తయారవుతుంది. కానీ వీటి గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. సన్ ఫ్లవర్ మొక్క పువ్వు మధ్య భాగంలో ఏర్పడే చిన్న గింజలనే సన్‌ఫ్లవర్ సీడ్స్ అంటారు. వీటిపై ఉండే గట్టి పొట్టు తొలగించి లోపలి గింజలను ఆహారంగా తీసుకుంటారు. ఈ గింజల నుంచే సన్‌ఫ్లవర్ నూనె కూడా తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వీటిని స్నాక్‌గా, సలాడ్స్, స్మూతీస్, బ్రెడ్, గ్రానోలా వంటి ఆహార పదార్థాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు.

సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. అలాగే మెగ్నీషియం, సెలీనియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్, ఐరన్, ప్రోటీన్లు, ఫైబర్, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే శరీరానికి మేలు చేసే అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కూడా వీటిలో అధికంగా ఉంటాయి. ఇవి శక్తిని అందించడమే కాకుండా శరీరంలోని అనేక అవయవాల పనితీరుకు తోడ్పడతాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, విటమిన్-ఈ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో తోడ్పడతాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ గింజలతో సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. కణాల దెబ్బతినకుండా కాపాడటంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తరచూ ఇన్‌ఫెక్షన్లు వచ్చే వారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఈ గింజలతో కండరాలు, ఎముకలు బలంగా మారేందుకు సహాయపడతాయి. వ్యాయామం చేసే వారు, క్రీడాకారులు, వృద్ధులు వీటిని పరిమిత మోతాదులో తీసుకుంటే శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.

సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఉండే ఫైబర్, ప్రోటీన్లు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడతాయి. దీంతో మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ నియంత్రణకు కొంత మేర ఉపయోగపడవచ్చు. అయితే ఇవి మందులకు ప్రత్యామ్నాయం కావని గుర్తుంచుకోవాలి. విటమిన్-ఈ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సన్‌ఫ్లవర్ సీడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చర్మ కణాలను రక్షించడం, వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా కనిపించేందుకు సహాయపడటం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు కూడా ఉండొచ్చు.

సన్‌ఫ్లవర్ సీడ్స్‌ను రోజుకు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు. స్వల్పంగా వేయించి స్నాక్‌గా తినవచ్చు. అలాగే సలాడ్స్, ఓట్స్, పెరుగు, స్మూతీస్ లేదా బ్రేక్‌ఫాస్ట్ బౌల్స్‌లో కలిపి తీసుకోవచ్చు. ఉప్పు, నూనె ఎక్కువగా కలిపిన ప్రాసెస్డ్ గింజల కంటే సహజమైన లేదా డ్రై రోస్టెడ్ గింజలను ఎంచుకోవడం మంచిది.

అయితే సన్‌ఫ్లవర్ సీడ్స్ ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అధికంగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే గింజల అలెర్జీ ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని మాత్రమే తీసుకోవాలి. సమతుల్య ఆహారంలో భాగంగా పరిమిత మోతాదులో తీసుకుంటేనే వీటి పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version