ABN Studio: మూతపడిన పత్రికను తిరిగి చేతుల్లోకి తీసుకొని.. లాభాల్లోకి రాగలిగేలా చేశాడు వేమూరి రాధాకృష్ణ. ఆ తర్వాత పత్రికకు సమాంతరంగా ఏబీఎన్ అనే పేరుతో ఛానల్ ఏర్పాటు చేశాడు. అది విజయవంతంగా ప్రసారాలు కొనసాగిస్తుంది. రేటింగ్స్ ప్రకారం మూడు లేదా నాలుగు స్థానాల్లో కొనసాగుతోంది. కొన్ని సందర్భాలలో రెండవ స్థానానికి కూడా వస్తోంది. గతంలో ఛానల్ లో వేమూరి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమం నిర్వహించేవారు. కొన్ని సందర్భాలలో డిబేట్ లు కూడా నిర్వహించేవారు. అప్పట్లో రేటింగ్స్ దూసుకుపోతూ ఉండేవి.
ఏబీఎన్ స్థిరంగా నిలబడిన తర్వాత.. ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నారు. అత్యాధునికమైన స్టూడియోను నిర్మించారు. గతంలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ వెనక వైపు ఏబీఎన్ ఒక కిరాయి అపార్ట్మెంట్లో నడిచేది. జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే ఒక ఖరీదైన ప్రాంతాన్ని కొనుగోలు చేసి స్టూడియో నిర్మించారు. భారీ భవనం నిర్మించినట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ9.. సాక్షి కి అత్యాధునిక స్టూడియోలు ఉన్నాయి. మిగతా చానల్స్ కు కూడా సొంతంగానే స్టూడియోలు ఉన్నప్పటికీ.. అవి అత్యాధునికమైనవి కాదు.
ఇప్పుడు ఏబీఎన్ టీవీ9, సాక్షి మాదిరిగానే అత్యాధునిక స్టూడియోలను నిర్మించింది. యాంకర్లను కూడా భారీగా రిక్రూట్ చేసుకోబోతోంది. వారందరికీ భారీగానే జీతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డిజిటల్ మాధ్యమంలో ఛానల్ ను మరింత బలోపేతం చేసేందుకు రాధాకృష్ణ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నికల సమయంలో రకరకాల డిజిటల్ మాధ్యమాలను ఆర్కే ప్రారంభించారు. వాటిని బలోపేతం చేశారు. ఇప్పుడు భవిష్యత్ మొత్తం డిజిటల్ మీడియాకే ఉండటంతో దానిని మరింత బలోపేతం చేసేందుకు ఆర్కే కసరత్తులు చేస్తున్నారు. అందువల్లే ఈస్థాయిలో స్టూడియోను రూపొందించారు. అంతేకాదు, ఒకేసారి అనేక రకాలుగా కార్యక్రమాలు రూపొందించేవిధంగా కార్యచరణ చేపట్టారు.దీనికి సంబంధించిన ప్రోమోను కూడా ఏబీఎన్ లో ప్రసారం చేస్తున్నారు.
రాధాకృష్ణ అల్లుడు భాను ప్రసాద్ ఏబీఎన్ నిర్వహణను చూసుకుంటున్నారు. రాధాకృష్ణ కూడా ఎప్పటికప్పుడు ఛానల్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రైమ్ టైం లో వెంకటకృష్ణ డిబేట్ లు నిర్వహిస్తున్నారు.. ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ రిషి కూడా ఏబీఎన్ లో చేరారు. ఎప్పటినుంచో స్వామి కూడా అందులో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే కాలంలో రెండో స్థానం మీద రాధాకృష్ణ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
