Sukanya Samriddhi Yojana: పిల్లల భవిష్యత్ కోసం చాలా మంది పెట్టుబడులు పెట్టాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు వారి పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటివి పొదుపు చేశారు. అయితే 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ‘సుకన్య సమృద్ధి యోజన’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సామాన్యుల నుంచి ఇందులో చిన్నమొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల వారి పిల్లల అవసరాలకు విడతల వారీగా నగదును అందిస్తారు. అయితే ప్రస్తుతం చాలా వరకు పిల్లల కోసం ఆర్థిక పథకాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఎన్పీఎస్ వాత్సల్య (NPS Vatsalya) ఒకటి. అయితే ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి? ఏ పథకం ఎవరికి అనుకూలం?
సుకన్య సమృద్ధి యోజన:
సుకన్య సమృద్ధి యోజన అనేది కేంద్ర ప్రభుత్వం బాలికల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన చిన్న పొదుపు పథకం. ఇందులో 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలిక పేరుపై ఖాతా తెరవొచ్చు. పోస్టాఫీసు లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల్లో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. తక్కువ మొత్తంతోనే పెట్టుబడి ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈ పథకంపై ప్రభుత్వం ప్రతి త్రైమాసికం వడ్డీ రేటును ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఇది చిన్న పొదుపు పథకాలలో అత్యధిక వడ్డీ అందించే స్కీమ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పథకంలో సంవత్సరానికి 8.2శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. ప్రతి ఏటా కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. ఖాతా తెరిచిన తర్వాత 15 సంవత్సరాల వరకు డబ్బు జమ చేయాలి. ఖాతా 21 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. ఉన్నత విద్య లేదా వివాహం కోసం కొన్ని షరతులతో ముందుగానే కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే.
ఎన్పీఎస్ వాత్సల్య:
ఎన్పీఎస్ వాత్సల్య అనేది పిల్లల కోసం రూపొందించిన కొత్త పెన్షన్ ఆధారిత పెట్టుబడి పథకం. ఇందులో 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలిక లేదా బాలుడు పేరుతోనైనా ఖాతా తెరవొచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల తరఫున పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకం మార్కెట్ ఆధారిత పెట్టుబడి కావడం వల్ల రాబడులు స్థిరంగా ఉండవు. కానీ దీర్ఘకాలంలో అత్యధిక వృద్ధిని అందిస్తుంది. ఈక్విటీల్లో సుమారు 14శాతం, కార్పొరేట్ డెట్‌లో 9.1శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలలో 8.8 శాతంవరకు సగటు రాబడులు ఉంటాయి. ఈ పెట్టుబడుల్లో చక్రవడ్డీ కూడా వస్తుండడంతో పిల్లల భవిష్యత్తుకు పెద్ద మొత్తంలో సంపదను సృష్టిస్తుంది. మార్కెట్ బాగా ఉంటే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉన్నా, రాబడికి ఎలాంటి హామీ ఉండదు. పిల్లలు 18 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత ఈ ఖాతా సాధారణ ఎన్పీఎస్ ఖాతాగా మారుతుంది.
రెండు పథకాల మధ్య ప్రధాన తేడాలు:
సుకన్య సమృద్ధి కేవలం బాలికలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో 15 సంవత్సరాల పాటు మాత్రమే నెలకు రూ. 1,000 చెల్లించాలి.అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చే వరకు మొత్తం పెట్టుబడిపై వడ్డీ జమ అవుతుంది 15 ఏళ్లలో మొత్తం రూ. 1,80,000 జమచేస్తే 21 ఏళ్ల తర్వాత సుమారు రూ. 5.5 లక్షల వరకు మెచ్యూరిటీ మొత్తం వస్తుంది (వడ్డీ రూపంలోనే రూ. 3.7 లక్షలు)
ఎన్పీఎస్ వాత్సల్య అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ వర్తిస్తుంది. సుకన్యలో ప్రభుత్వం నిర్ణయించే హామీతో కూడిన వడ్డీ లభిస్తుంది. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ. 1,000 చొప్పున కడితే మొత్తం రూ. 2,16,000 అవుతుంది. సంవత్సరానికి సగటున 10 శాతం రాబడి వస్తుందని భావిస్తే.. ఈ మొత్తం దాదాపు రూ. 6 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే మార్కెట్ అస్థిరతలకు లోబడి రాబడి ఉంటుంది.
ఏది బెస్ట్?
కూతురు భవిష్యత్తు, చదువు, పెళ్లి కోసం భద్రమైన పెట్టుబడి కావాలనుకుంటే సుకన్య సమృద్ధి యోజన మంచి ఎంపికగా చెప్పవచ్చు. పిల్లల కోసం దీర్ఘకాలంలో మార్కెట్ ఆధారిత అధిక రాబడి కోరుకుంటే, అలాగే కొంత రిస్క్‌ను భరించే సామర్థ్యం ఉంటే ఎన్పీఎస్ వాత్సల్యను పరిశీలించవచ్చు. అబ్బాయిల కోసం సుకన్య అందుబాటులో ఉండదు కాబట్టి ఎన్పీఎస్ వాత్సల్య ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. చాలామంది ఆర్థిక నిపుణులు చెబుతున్న ప్రకారం.. అవసరాలను బట్టి ఈ రెండు పథకాలను కలిపి ఉపయోగించడం ద్వారా భద్రతతో పాటు వృద్ధి అవకాశాన్ని కూడా పొందవచ్చని సూచిస్తున్నారు.
