BRS: నమ్మకం లేదు దొరా.. ఇటీవల ఫేమస్ అయిన కొటేషన్ ఇదీ.. ఇదే కొటేషన్‌ను బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు పార్టీ అధినేతకు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత అందులోని నాయకులు వరుసగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలంతా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని సాకు చెప్పారు. ఇక ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వెళ్తున్న నేతలు మాత్రం.. పార్టీ బతుకుతదనే నమ్మకం లేదు దొర అని చెబుతున్నారట.
కేసీఆర్ సొంత జిల్లా నుంచే మొదలు..
ఎన్నికలు ముగిసి వంద రోజులు కాకముందే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆ తర్వాత చాలా మంది నేతలు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారు. ఇక చేరిక మాత్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో మొదలైంది. అంతకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి దంపతులతోపాటు పలువురు నేతలు, మున్సిల్ ౖచెర్మన్లు, జెడ్పీ చైర్మన్లు అప్పటికే హస్తం గూటికి చేరారు. తర్వాత సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, తర్వాత రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరగా, బీబీ పాటిల్, రాములు బీజేపీలో చేరారు.
కొనసాగుతున్న వలసలు..
కాంగ్రెస్ గేట్లు తెరిచామని సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించిన కొన్ని గంటలకే దానం నాగేందర్ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత వలసలు ఊపందుకున్నాయి. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించిన నేతలు కూడా ఇప్పుడు హస్తంవైపు చూస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో రేవంత్‌రెడ్డి కూడా ఎవరు వచ్చినా కాదనకుండా కండువాలు కప్పుతున్నారు.
కేకే, కడియం వలస బాట..
ఇక తాజాగా బీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత, నంబర్ 2 పొజిషన్‌లో ఉన్న కే.కేశవరావు, ఆయన తనయ, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా తాజాగా బీఆర్‌ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. వీరి నిర్ణయం వెలువడిన కొద్ది సేపటికే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కూడా గులాబీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కావ్యకు ఇప్పటికే వరంగల్ ఎంపీ టికెట్ కూడా ప్రకటించారు గులాబీ బాస్ కేసీఆర్. అయినా.. అందులో ఉంటే గెలవమని నిర్ణయానికి వచ్చిన కడియం కావ్య.. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్‌కు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్, అవినీతి ఆరోపణలతో పార్టీ తీవ్రంగా డ్యామేజీ అయిందని తెలిపారు. కావ్య నిర్ణయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా నిర్ధారించారు. మారిచ 30న కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి అంటే ఇదే. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల ఉనికే లేకుండా చేసిన కేసీఆర్.. ఇప్పుడు తమ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి రావడంతో చేష్టలుడి చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల నాటికే బీఆర్‌ఎస్ ఖాలీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా అందరూ కలిసి బీ ఆర్ ఎస్ ను చంపేస్తున్నారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.