Shubman Gill : ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో టీమ్ ఇండియా 2-2 తేడాతో సమానంగా నిలిచింది. ఇంగ్లాండ్ జట్టుకు వారి స్వదేశంలోనే చుక్కలు చూపించింది. ఒకవేళ లార్డ్స్ టెస్ట్ లో గనుక టీమిండియా విజయం సాధిస్తే.. కచ్చితంగా సిరీస్ సొంతం చేసుకునేది. తద్వారా డబ్ల్యుటిసి పాయింట్ల పట్టికలో రెండవ స్థానాన్ని ఆక్రమించేది. లార్డ్స్ టెస్టులో ఓడిపోవడం.. నాలుగో టెస్ట్ డ్రా చేసుకోవడం.. ఐదవ టెస్టును నాటకీయపరిణామాల మధ్య గెలవడంతో సారధిగా గిల్ కు మంచి మార్కులు పడ్డాయి.
టెస్ట్ సిరీస్లో టీమ్ ఇండియాను సరైన మార్గంలో నడిపించిన నేపథ్యంలో గిల్ కు బిసిసిఐ బ్రహ్మాండమైన బహుమతులు ఇస్తుందని.. పరిమిత ఓవర్ల క్రికెట్ కు అతడిని నాయకుడిగా నియమిస్తుందని అందరూ అనుకున్నారు. జాతీయ మీడియా కూడా ఇదే దిశగా కథనాలను ప్రసారం చేసింది. కానీ గిల్ అభిమానులకు షాక్ ఇచ్చే విధంగా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ తర్వాత కోలుకున్న సూర్య కుమార్ యాదవే ఆసియా కప్ లో టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తాడని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. దీనికి తోడు సూర్య కుమార్ యాదవ్ జిమ్ లో కసరత్తు చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో గిల్ ను నాయకుడిగా నియమించే అవకాశం లేదని తేలిపోయింది.
అయితే తాజాగా జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం గిల్ ఆసియా కప్ లో భారత జట్టు కు ఉపసారథిగా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో.. భారత జట్టు ఆసియా కప్ ఆడుతుందని.. గిల్ ఉపసారధిగా వ్యవహరిస్తాడని కథనాలు ప్రసారమవుతున్నాయి. మరోవైపు వచ్చే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కు సారధిగా గిల్ ఉంటాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే గనుక జరిగితే రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటాడని తెలుస్తోంది.. అయితే వన్డే వరల్డ్ కప్ సారధిని నియమించే విషయంలో మేనేజ్మెంట్ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.