Shree charani : ఆ అమ్మాయిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప.. పేరు శ్రీ చరణి . వయసు 21 సంవత్సరాలు.. ఈ ఏడాది జూన్ నెలలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తనదైన స్పిన్ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ లో అవకాశం రావడంతో సత్తా చూపిస్తున్నది. పెద్ద పెద్ద బౌలర్లు విఫలమవుతున్న చోట.. తాను మాత్రం అదరగొడుతున్నది.
తాజా వన్డే వరల్డ్ కప్ లో సంచలనాల మీద సంచలనాలు నమోదు చేస్తోంది. ఎంతో అనుభవం ఉన్న బౌలర్ గా రికార్డులు సృష్టిస్తోంది. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు 11 వికెట్లు సొంతం చేసుకుంది. జట్టు అవసరాలకు తగ్గట్టుగా బౌలింగ్ చేస్తూ దుమ్ము రేపుతోంది. జట్టుకు వికెట్ కావలసిన సమయంలో.. కెప్టెన్ తన వైపు చూసే విధంగా చేసుకుంది. విభిన్నమైన బౌలింగ్ స్టైల్ తో ఆకట్టుకుంటున్న ఈ తెలుగు అమ్మాయి.. మహిళ అనిల్ కుంబ్లే గా పేరు తెచ్చుకుంది. ఎటువంటి జీవం లేని పిచ్ మీద కూడా రకరకాలుగా మెలి తిప్పుతూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకుంది. అందువల్లే ఈమె బౌలింగ్లో ఆడాలంటే ప్లేయర్లు ఇబ్బంది పడుతున్నారు.
ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో 2/49, బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 2/23, న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 1/58, ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 2/68, ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 3/41 వికెట్లు పడగొట్టింది. ఇక దక్షిణాఫ్రికా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఇప్పటివరకు ఒక వికెట్ సొంతం చేసుకుంది. ఈ కథనం రాసే సమయం వరకు వన్డే వరల్డ్ కప్ లో ఆమె 11 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతానికి ఈ అమ్మాయి వయసు 21 సంవత్సరాలు. ఎంట్రీ ఇచ్చిన నెలల వ్యవధిలోనే ఈ స్థాయిలో సత్తా చాటుతోంది అంటే.. మరిన్ని అవకాశాలు ఇస్తే టీమిండియాలో సూపర్ బౌలర్ గా అవతరిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈమె తెలుగు అమ్మాయి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిమానులు ఈమెను విపరీతంగా ఆరాధిస్తున్నారు. అంతేకాదు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మూడు వికెట్లు తీయడం ద్వారా.. ఈమె గురించి వివిధ సామాజిక మాధ్యమ వేదికలలో తెగ శోధిస్తున్నారు.