RK Kothapaluku : అణచివేత అధికమైతే.. ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది అంటారు. ఇది అన్ని విషయాలకు వర్తిస్తుంది. మన పొరుగున ఉన్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ ప్రాంతాలలో ప్రజల్లో ఉద్యమం పుట్టింది. ఫలితంగా పాలకులు నేలకు దిగివచ్చారు. ప్రజా ఆగ్రహానికి తట్టుకోలేక పారిపోయారు. ఈ ఉదంతాలు సహజంగానే మన దేశం మీద కూడా ప్రభావం చూపిస్తుంటాయి. కాకపోతే మనదేశంలో విభిన్నమైన రాజకీయాలు ఉంటాయి కాబట్టి అంత త్వరగా ప్రభావితమవుతుందనుకోవడానికి లేదు. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన పత్రికలో ఆదివారం ప్రచురితమైన కొత్త పలుకులో ప్రముఖంగా ప్రస్తావించారు.
అంతర్జాతీయ పరిణామాలు.. అవి మన దేశం మీద చూపించే ప్రభావం వరకు రాధాకృష్ణ రాస్తే సరిపోయేది. కానీ ఇక్కడ కూడా జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. జగన్ కేసులలో ఇరుక్కున్నారు కాబట్టి.. వెంటనే జైలుకు పంపించాలని న్యాయవ్యవస్థను రాధాకృష్ణ డిమాండ్ చేశారు. అదేదో సినిమాలో నువ్వు పాడుతున్న పాట ఏంటి.. ఎత్తుకున్న రాగం ఏంటి.. అని బ్రహ్మానందం త్రిషను అడుగుతుంటాడు కదా.. అలాగే రాధాకృష్ణ రాసిన వ్యాసం మొత్తం చదివిన తర్వాత సగటు పాఠకుడు ఇదే ప్రశ్నను వ్యక్తం చేస్తూ ఉంటాడు.మనదేశంలో కేవలం జగన్ మీద మాత్రమే కేసులు ఉన్నట్టు.. జగన్ మాత్రమే వ్యవస్థలను ఆగం చేసినట్టు రాధాకృష్ణ రాసిన తీరు నిజంగా ఆశ్చర్యకరం. ఆ మాటకు వస్తే చంద్రబాబు మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఇప్పటికీ ఆయన స్టేల మీదనే ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కూడా ఆయన పేరు వినిపించింది. జగన్ ప్రభుత్వం ఆయన జైలుకు కూడా వెళ్లిపోయారు. ఆ విషయాన్ని రాధాకృష్ణ ప్రస్తావించలేదు. కేవలం కేసీఆర్, జగన్ మీద మాత్రమే పడిపోయారు.
నిజానికి మనదేశంలో రాజకీయ వ్యవస్థ సర్వనాశనమైంది. రాజకీయ నాయకులు తాము అధికారాన్ని దక్కించుకోవడానికి.. తాము దక్కించుకున్న అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి వ్యవస్థలను అడ్డం పెట్టుకుంటున్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కాకపోతే మన దేశ ప్రజలు వివేకవంతులు కాబట్టి ఏ ఒక్క పార్టీకి ఏకపక్షంగా తీర్పు ఇవ్వకుండా.. విభిన్నతను ప్రదర్శిస్తున్నారు. అందువల్లే మన దేశం ఇంకా ఎటువంటి ఉద్యమాలకు.. ప్రభావాలకు గురికాకుండా ఉంటున్నది. ఇదే విషయాన్ని ప్రముఖంగా చెప్పినప్పటికీ రాధాకృష్ణ చివర్లో ఆవు వ్యాసం మాదిరిగా జగన్ ప్రస్తావన, కెసిఆర్ కాలేశ్వరం కేసు తెరపైకి తీసుకురావడం విశేషం. జగన్ అంటే పడదు కాబట్టి.. కెసిఆర్ తో వైరం ఉంది కాబట్టి రాధాకృష్ణ ఇలా రాశాడు అనుకోవాలా.. చంద్రబాబు, రేవంత్ మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాలలో తమ అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని ఆలోచన అనుకోవాలా.. ఏమైనా సరే, ఏదైనా సరే.. రాధాకృష్ణ జగన్ ను వదిలిపెట్టడు.. కెసిఆర్ ప్రస్తావన తీసుకురాకుండా ఉండడు. ఎందుకంటే అతడు జర్నలిజంలో ఉన్న బ్యూటీ సారీ సారీ కసి అదే కాబట్టి.. ఇంకా మిగతా విషయాలు అంటారా? కొత్త పలుకు మొత్తం ఆవు వ్యాసం లాగా ఉంది..మాల్ మసాలా వేయని వంటకంలాగా ఉంది.