Andhra Cricket : జాతీయ క్రికెట్ జట్లకు విదేశీ కోచ్ లను నియమించుకోవడం కొత్తేమీ కాదు. మన జాతీయ క్రికెట్ జట్టుకు ఎంతోమంది విదేశీ కోచ్ లు పనిచేశారు. భవిష్యత్తు కాలంలోనూ చేసే అవకాశం ఉంది. ఇతర జాతీయ జట్లకు కూడా విదేశీ కోచ్ లు శిక్షణ ఇస్తున్నారు. 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి టీమిండియా, న్యూజిలాండ్ వెళ్లాయి. ఫైనల్ పోటీలో న్యూజిలాండ్ విజయం సాధించింది. దానికంటే ముందు 2019లో పరిమిత ఓవర్ల ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ ఫైనల్ దాకా వెళ్ళింది. ఈ రెండు ప్రతిష్టాత్మక టోర్నీలలో కివీస్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లడంలో కోచ్ గ్యారీ స్టీడ్ ముఖ్యపాత్ర పోషించాడు. ఐసీసీకి సంబంధించిన మేజర్ టోర్నీలలో కివీస్ ఆ స్థాయిలో సత్తా చూపించడం వెనక అతడు చేసిన కృషి మాములుది కాదు. అయితే ఇప్పుడు స్టీడ్ న్యూజిలాండ్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అతడు శిక్షకుడిగా పనిచేసేది టీమిండియాకో.. మరో జట్టుకో కాదు. ఓ రాష్ట్రానికి సంబంధించిన క్రికెట్ జట్టుకు అతడు కోచ్ గా రాబోతున్నాడు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.
మనదేశంలోని ఆంధ్ర క్రికెట్ సంఘం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది.. ముఖ్యంగా డొమెస్టిక్ క్రికెట్లో సరికొత్త ప్రణాళికలకు నాంది పలికింది. ఇందులో భాగంగానే కివీస్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరిస్తున్న స్టీడ్ ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్ గా నియమించుకుందని వార్తలు వస్తున్నాయి. ” మొదట్లో మేము కంగారు దేశానికి చెందిన వ్యక్తిని కోచ్ గా నియమించుకోవాలని అనుకున్నాం. అయితే ఒక స్నేహితుడు స్టీడ్ ను ఎందుకు ప్రయత్నించకూడదని సూచించాడు. అది కూడా మాకు సమ్మతం అనిపించింది. వెంటనే అతడిని మేము సంప్రదించాం.. మొదటి సంభాషణ నుంచే అతడు సంసిద్ధతను వ్యక్తం చేశాడు. అది మాకు ఆశ్చర్యం కలిగించింది. మా జట్టు గురించి అతనికి పూర్తి అవగాహన ఉంది. అందువల్లే సన్నాహక మా విషయానికి వచ్చాడని” ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు పేర్కొన్నారు.
ఈ ఏడాది జూన్ లో న్యూజిలాండ్ జట్టుతో స్టీడ్ ఒప్పందం ముగుస్తుంది. దాదాపు 7 సంవత్సరాలుగా స్టీడ్ న్యూజిలాండ్ జాతీయ జట్టుతో ప్రయాణిస్తున్నాడు. అతడి ఆధ్వర్యంలో ఐసీసీ టెస్ట్, వన్డే ర్యాంకులలో న్యూజిలాండ్ జట్టు నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 2019లో ప్రపంచ కప్ లో సెమీఫైనల్, ఇంగ్లాండ్లో జరిగిన డబ్ల్యూటీసి ఫైనల్ లో టీమిండియాను ఓడించింది.. మరో వారం రోజుల్లో స్టీడ్ విశాఖపట్నం వస్తున్నారని తెలుస్తోంది.. అయితే ఏడాది పాటు పనిచేయడానికి స్టీడ్ ఒప్పందం మీద సంతకం చేశారని తెలుస్తోంది.. రెండు సంవత్సరాల పాటు ఆంధ్ర క్రికెట్ జట్టుతో ఆయన ప్రయాణం సాగిస్తాడని ప్రచారం జరుగుతోంది.. ఒప్పందం మీద సంతకం కంటే ముందు క్రిస్మస్ సందర్భంగా తన స్వదేశానికి వెళ్లేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనుమతించాలని అతడు అభ్యర్థించినట్టు తెలుస్తోంది. దానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఒప్పుకుందని సమాచారం. భారతదేశంలో అతడు ఉండడానికి వర్క్ వీసా కూడా లభించిందని.. సెప్టెంబర్ 20 నుంచి 25 తేదీల మధ్యలో అతడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గత ఏడాది డొమెస్టిక్ క్రికెట్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించింది. రంజీలలో గ్రూప్ బి లో ఏడు మ్యాచ్లు ఆడిన ఆంధ్ర జట్టు ఒకేఒక్క విజయం సాధించింది. మూడు ఓటమిలో నమోదుచేసి ఆరో స్థానంలో నిలిచింది. వీహెచ్టీ లో నాలుగు స్థానంలో, ఎస్ఎంఎటీ టోర్నీలో ముంబై కంటే మెరుగైన స్థానంలో ఏపీ జట్టు నిలిచింది. అయితే ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ఉత్తర ప్రదేశ్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఈ ఏడాది డొమెస్టిక్ సీజన్ ప్రారంభానికి ముందు ఆంధ్ర జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ ఆటగాడు హనుమ విహారి జట్టు నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రికి భుయ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ జట్టులో సౌరభ్ కుమార్ సీనియర్ ఆటగాడిగా ఉన్నాడు. సౌరభ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చెందిన ఎడమ చేతివాటం స్పిన్నర్. ఇతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉండడంతో ఆంధ్ర జట్టు ప్రొఫెషనల్ ప్లేయర్ గా నియమించుకుంది.