Road accidents : సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చూశారా.. అందులో ఓ డైలాగు ఉంటుంది.. రోడ్డు యాక్సిడెంట్ అంటే రోడ్డుమీద బైకో, కారో పడిపోవడం కాదు. ఒక కుటుంబం రోడ్డు మీద పడడం.. ఇప్పుడు తెలంగాణలో కూడా పరిస్థితి అలానే మారిపోయింది. . వరుస రోడ్డు ప్రమాదాలు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కేవలం తెలంగాణలోనే కాదు.. మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. రోడ్డు ప్రమాదాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఆర్టీసీ బస్సులు, ప్రవేటు బస్సులు లారీలు, ఇతర భారీ వాహనాలు ప్రమాదాలకు గురి కావడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది.
సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఏపీలోని కర్నూలు జిల్లాలోని టేకూరు ప్రాంతంలో ప్రవేటు బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు పది మంది దాకా ప్రయాణికులు చనిపోయారు.. చాలామంది గాయపడ్డారు. ఈ ఘటన మర్చిపోకముందే హైదరాబాదులోని చేవెళ్ల ప్రాంతంలో ఆర్టీసీ బస్సు, కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది దాకా ప్రయాణికులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు.. ఈ రెండు సంఘటనలు మర్చిపోకముందే మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వరదల్ని కూడా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దీనిని మర్చిపోకముందే నల్గొండ జిల్లా బుగ్గ బావి కూడా వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వర్షాలకు రోడ్లు సరిగా లేకపోవడం.. డ్రైవర్లకు వాహనాలు నడిపే విధానం పై అవగాహన లేకపోవడం.. మద్యం తాగి వాహనాలను నడుపుతుండడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. పైగా ఆర్టీసీ డ్రైవర్లకు కూడా సరిగ్గా నిద్ర ఉండడం లేదని.. వారికి సరైన స్థాయిలో విశ్రాంతి లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు పని మీద బయటకు వెళ్లినవారు భద్రంగా ఇంటికి వస్తారని భరోసా వుండేది.. ఇప్పుడు ద్విచక్ర వాహనాల మీద.. ఇతర వాహనాల మీద పని మీద బయటకు వెళ్లినవారు ఇంటికి వస్తారని గ్యారంటీ లేదు. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడం వల్ల ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది.
రోడ్డు ప్రమాదాల వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.. ఎదుటి వాహనం మృత్యుపాశం లాగా దూసుకు వస్తుండడంతో ప్రాణాలు అమాంతం గాలిలో కలిసిపోతున్నాయి. గడచిన పది రోజుల్లోనే దేశ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో సుమారు 60 కి మించి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేవలం రోడ్డు ప్రమాదాలు మాత్రమే కాదు.. రైల్లో ప్రయాణిస్తే కూడా ప్రాణానికి గ్యారెంటీ లేకుండా పోయింది. చత్తీస్ గడ్ ప్రాంతంలోని జయరాం నగర్ స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. 25 మంది గాయపడ్డారు. ఘటన స్థలానికి అధికారులు చేరుకున్నారు. సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.