Revanth Reddy : గ్రూప్ 1 వివాదంలో పీకల్లోతు కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వానికి గుడ్ న్యూస్. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిలీఫ్ ఇచ్చారు. కొద్దిరోజులుగా స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42 రిజర్వేషన్ ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా శాసనసభలో తీర్మానం కూడా చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్ కు పంపించింది.
వాస్తవానికి మనదేశంలో రిజర్వేషన్లు 50% మించ కూడదు. తమిళనాడు రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ మాత్రం ఈ నిబంధన వర్తించదు. కానీ మిగతా రాష్ట్రాలలో అలా ఉండదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. దీనికి తగ్గట్టుగానే శాసనసభలో తీర్మానాన్ని రూపొందించారు. ఈ తీర్మానంపై భారత రాష్ట్ర సమితి పెదవి విరిచింది. ఇది అయ్యే పని కాదని.. బీసీలను ముంచే కుట్ర అని ఆరోపించింది. కానీ ఈ వ్యవహారంలో తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత మాత్రం ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడారు. తాను బీసీలకు అండగా ఉంటానని.. 42 శాతం రిజర్వేషన్ ప్రతిపాదిస్తూ ప్రభుత్వం పంపించిన తీర్మానానికి సంఘీభావం తెలుపుతానని ప్రకటించారు. ఏనాడైనా సరే గులాబీ పార్టీ కూడా తన లైన్ లోకి రావాలని స్పష్టం చేశారు. నాడు ఆమె చేసిన వ్యాఖ్యలను గులాబీ పార్టీ నాయకులు ఖండించారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కానీ చివరికి కవిత చెప్పిన మాటలే నిజమయ్యాయి. ఆమె దారిలోకి గులాబీ పార్టీ రావాల్సిన అవసరం ఏర్పడింది.
ఇక ఇన్నాళ్లుగా 42% రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉంది. దానిని గవర్నర్ ఆమోదించడంతో ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ లభించింది. దీంతో త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాజ్ భవన్ నుంచి ప్రభుత్వానికి ఆదేశాలు వెళ్ళినట్టు ప్రచారం జరుగుతోంది. గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే ఓటర్ల జాబితా.. ఓటర్ల వివరాల నమోదు.. తదితర పనులు మొత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది.. ఇక ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడమే ఆలస్యం.
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ వర్తించకపోతే పార్టీ పరంగా తామే ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికంటే ముందు గవర్నమెంట్ మీద ఆయన సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. కేంద్ర మంత్రులను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించారు. ఇక్కడి సమస్యలను వారికి విన్నవించిన రేవంత్.. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో ఇబ్బందికరంగా ఉన్న 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఏకీభవించిన కేంద్ర పెద్దలు గవర్నర్ కు వర్తమానం పంపినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వర్తమానం రావడంతోనే గవర్నర్ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో రేవంత్ ఊహించినట్టుగానే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లభించనుంది. ఇది ఒక రకంగా అధికార కాంగ్రెస్ పార్టీకి గేమ్ చేంజర్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.