Ugadi 2024: నేడు ఉగాది: రేవంత్, జగన్, కేసీఆర్, చంద్రబాబు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో విరామం ఎరగకుండా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 9, 2024 2:52 pm

Ugadi 2024

Follow us on

Ugadi 2024: కొత్త చిగుళ్లతో వృక్షాలు, నిండైన పూతతో వేప చెట్లు, మెండైన కాతతో మామిడి వృక్షాలు, కుహు కుహు అంటూ పాటలు పాడే కోయిలలు.. ఇన్నింటి సందడి మధ్య ఉగాది మనల్ని పలకరిస్తుంది. వాస్తవానికి మనకు తెలుగు సంవత్సరాది ఈ పండుగతోనే ప్రారంభమవుతుంది. ఈసారి శ్రీ క్రోధి నామ సంవత్సరంగా ఉగాదిని తెలుగు ప్రజలు జరుపుకుంటున్నారు. ఉగాది అనగానే చాలామందికి పంచాంగం శ్రవణం గుర్తుకొస్తుంది. ఎవరి రాశి ఏంటి? ఆ రాశి బలం ఎలా ఉంది? వచ్చే ఆదాయం ఎంత? అయ్యే ఖర్చు ఎంత? రాజపూజ్యం ఎంత? అవమానం ఎంత? చేపట్టబోయే పనిలో ఏమైనా విఘ్నాలు ఎదురవుతాయా? వీటన్నింటినీ ఆలయంలో పూజారి ద్వారా తెలుసుకోవడం ఆనవాయితీ.

ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో పంచాంగం అనేది విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో పంచాంగం అంటే కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉండేది. పైగా ఆ లెక్కలు సామాన్య ప్రజలకు అర్థమయ్యేవి కావు. ఉగాదినాడు పూజారి వద్దకు వెళ్తే పేరు, పుట్టిన తేదీ, సమయం చెబితే.. నక్షత్రాలు ఆధారంగా ఆయన రాశి ఏంటో చెప్పేవారు. సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో వివరించేవారు. అంతేకాదు ఏలినాటి శని ప్రభావం ఉంటే దానికి విరుగుడుగా ఏం పూజలు చేయాలో కూడా చెప్పేవారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పంచాంగం అనేది అరచేతిలో ఇమిడిపోయింది. పుట్టిన తేదీ, సమయం ఆధారంగా వారి రాశులను తెలుసుకునే వెసలు బాటు కలిగింది.. అయితే సామాన్యుల విషయం పక్కన పెడితే.. రాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇరువురు ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నాయకుల తారాబలం ఒక్కసారి పరిశీలిస్తే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో విరామం ఎరగకుండా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వంద రోజులు విజయవంతంగా పరిపాలన ముగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిస్తే.. రేవంత్ రెడ్డిది తులారాశి. ఈయనకు ఆదాయం 2, వ్యయం 1 గా ఉంది. రాజపూజ్యం ఒకటి, అవమానం ఐదుగా ఉంది.. తులారాశి వారికి ఈ ఏడాది దైవ బలం మెండుగా ఉంది.. ఏ పని అనుకున్నా వెంటనే జరిగిపోతుంది. ఇక రేవంత్ రెడ్డికి బుధ మహర్దశ కొనసాగుతోంది. పంచాంగం ప్రకారం ఆయనకు 15 ఏళ్ల పాటు తిరుగు ఉండదని తెలుస్తోంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాశి మిధున రాశి.. ఈయనకు ఆదాయం 5, వ్యయం అయిదుగా ఉంది. రాజపూజ్యం మూడు, అవమానం ఐదుగా ఉంది. ఈ రాశి వారు మే తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.. ఈ రాశి వారికి కష్టపడితేనే విజయం దక్కుతుంది. అయితే ఆ దక్కిన విజయాన్ని వారు దర్జాగా నిలుపుకుంటారు.. ఈ రాశి వారికి బుధుడు మహర్దశలో ఉన్నాడు. అందువల్ల ఎటువంటి పదవి గండాలు ఉండవట.. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుందట. గురుడు, శని, రాహువు మంచి స్థానంలో ఉండడంతో వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరు తమ తెలివితేటలతో ఎంతటి వారినైనా ఒప్పించ గలుగుతారట.

చంద్రబాబు, కేసీఆర్

చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరిదీ కర్కాటక రాశి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు రెండు, రాజపుజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి అష్టమ శని ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని పంచాంగం చెబుతోంది. అంతేకాదు వరుస ఇబ్బందులు కూడా ఎదురవుతాయని వివరిస్తోంది. ఆదాయం పరంగా పెద్దగా డోకా లేకపోయినప్పటికీ.. జీవితంలో అనుకున్న లక్ష్యాలు, కోరుకున్న కోరికలు నెరవేరడం కష్టమని పంచాంగం చెబుతోంది.