Telangana Districts: ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్పు చూపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు అమలు కాకపోవచ్చని… పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన అనంతరం అమలకు నోచుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ రేవంత్ రెడ్డి మదిలో ఉన్న ఆ నిర్ణయం ఏంటి? ఎందుకు మీడియా ఆ అంశానికి తెగ ప్రాధాన్యమిస్తోంది?
ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి ఆమధ్య ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తనదైన శైలిలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. జిల్లాల పునర్విభజనపై కూడా మాట్లాడారు.” గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా జిల్లాలు ఏర్పాటు చేశారు. జిల్లాల ఏర్పాటు ఎందుకు చేశారో ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కనీసం కొన్నిచోట్ల కార్యాలయాలు కూడా లేవు. నేను మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను.. ఒకసారి జడ్పీ సమావేశం జరుగుతున్నప్పుడు.. పట్టుమని పదిమంది సభ్యులు కూడా లేరు. ఇదేంటి అని అడిగితే.. జిల్లాలో ఉన్నది ఇంతమందే సార్ అని జడ్పీ సీఈవో చెప్పారు. పైగా కార్యాలయం చాలా ఇరుకుగా ఉంది. కనీస సౌకర్యాలు కల్పించకుండా జిల్లాలు ఏర్పాటు చేస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది. చాలావరకు నాకు ఈ అంశాల మీద ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే జిల్లాల పునర్విభజన చేయాలని భావిస్తున్నామని” రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రకటించారు.
రేవంత్ రెడ్డి అప్పట్లో ఆ మాటలన్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులు స్పందించారు. ఇప్పుడున్న జిల్లాలను పునర్విభజన చేస్తే పారిస్థితిలో పునర్విభజన చేస్తే పారిస్థితిలో పునర్విభజన చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ ఆ హెచ్చరికలను రేవంత్ పెద్దగా లెక్క చేయడం లేదని తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన వైపే ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తుందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ తరహాలోనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. ఎన్నికల తర్వాత దీనిపై ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కొత్త జిల్లా కేంద్రాల్లో గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాలు నిర్మించింది. ఇదే స్థాయిలో మిగతా కార్యాలయాలు నిర్మించలేదు. దీంతో కొన్ని శాఖలు అద్దె భవనాలలోనే సాగుతున్నాయి. ఇక కీలక పోస్టులకు అధికారులను నియమించకపోవడంతో చాలావరకు ఇన్ ఛార్జ్ ల పాలన సాగుతోంది. అలాంటప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఉపయోగమేంటని ప్రస్తుత ప్రభుత్వం వాదిస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాలు ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని.. ఆ ప్రాంతాలు కూడా మరింత మెరుగ్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా దీనికి సంబంధించి స్పష్టమైన విధివిధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.