Jagan: ఏపీ సీఎం జగన్ గురించి విపక్షాలు రకరకాలుగా ప్రచారం చేస్తుంటాయి. ఆయన చదువు, ప్రవర్తన తీరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుంటాయి. ముఖ్యంగా చదువు విషయంలో శాసనసభ వేదికగానే.. అనేక ఊహాగానాలకు తావిచ్చేలా టిడిపి నేతలు ఆరోపణలు చేశారు. చదువులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని.. ప్రశ్న పత్రాలు మాయం చేశారని.. ఏవేవో ఆరోపణలు చేశారు. వాటినే ట్రోల్ చేశారు. అయితే జగన్ ఎడ్యుకేషన్ విషయంలో ఆసక్తికర పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది.
జగన్ పెద్దగా చదువుకోలేదన్నది బయట జరుగుతున్న ప్రచారం. తండ్రి రాజశేఖర్ రెడ్డి డాక్టర్ కాగా.. జగన్ ఆ స్థాయిలో చదివాడా? లేదా? అన్నది అందరిలో ఒక అనుమానం. జగన్ ఇంటర్ వరకు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఇంటర్ తర్వాత ఆయన ఎక్కడ చదివారు? ఏం చేశారు? ఏ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు? డిగ్రీలో ఆయన చేసిన కోర్సు ఏంటి? విషయాలు పెద్దగా బయటకు రాలేదు. కానీ వీటన్నింటికీ సమాధానం చెబుతూ ఏకంగా జగన్ డిగ్రీ మార్క్ షీట్ సోషల్ మీడియాలోకి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసుకున్న జగన్.. ప్రగతి మహావిద్యాలయలో డిగ్రీలో చేరారు. కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా మూడేళ్లు డిగ్రీ అక్కడే పూర్తి చేశారు.బిజినెస్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టాటస్టిక్స్, బ్యాంకింగ్, బిజినెస్ ఆర్గనైజింగ్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ సివిలైజేషన్లో ఆయన తన డిగ్రీని పూర్తి చేసినట్లు తెలుస్తోంది.విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఆయన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాదు. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ విద్యార్థి. 740 మార్కులను ఆయన సాధించారు. 1994 జూన్ 17న ఆ మార్కుల జాబితాను ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కళాశాల జారీచేసింది. ఈ కళాశాల ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తుంది. మార్కుల జాబితాలో తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. చదివింది బిజినెస్ రిలేటెడ్ డిగ్రీ కావడంతో వ్యాపార రంగంలో జగన్ అడుగు పెట్టారు. అక్కడ రాణించి రాజకీయ రంగంలోకి వచ్చారు. సక్సెస్ బాట పట్టారు.