Premante Movie Review : నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల, వెన్నెల కిషోర్, హైపర్ ఆది తదితరులు.
సంగీతం: లియోన్ జేమ్స్
ఛాయాగ్రహణం: విశ్వనాథ్ రెడ్డి Ch.
దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: జాన్వి నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు.
స్టార్ ఇమేజ్, మాస్ హీరో ఇమేజ్ అంటూ రొట్ట పాత్రల వెంట, మూస కథల వెంట పరిగెత్తకుండా విభిన్నమైన పాత్రలను, కథలను ఎంచుకుంటూ సాగిపోతున్న హీరో ప్రియదర్శి. కోర్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించినా తర్వాత రిలీజ్ అయిన సిల్లీ స్నేహితుల ‘మిత్రమండలి’ తో బోల్తా పడ్డాడు. తాజాగా ‘ప్రేమంటే’ అంటూ ఒక కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ట్రైలర్ చూస్తే ఇదేదో సరదాగా సాగే భార్యా భర్తల పోరాటంలాగా అనిపించింది. మరి భార్యాభర్తల పోరాటం నిజంగానే నవ్వులు పంచిందా లేదా ఉసూరుమనిపించిందా అనేది రివ్యూలో చూద్దాం.
మధుసూధన రావ్.. మది(ప్రియదర్శి) ఒక దొంగ. పాతకాలం దొంగలాగా బుర్రమీసం నడుమున బెల్టు, ఒంటికి నూనె లాంటి పాతకాలం పద్దతులు కాకుండా జెన్ జీ స్టైల్లో సుజాత సెక్యూరిటీ సర్వీసెస్ అంటూ ఒక కంపెనీ నడుపుతుంటాడు. ఒక ఐటీ ఉద్యోగిలాగా ఎంతో క్లాసుగా ఉంటాడు. తన స్నేహితులే సుజాత సెక్యూరిటీ సర్వీసెస్ లో ఉద్యోగులు.. అంటే తోడుదొంగలు. ఎవరికీ దొరక్కుండా జాగ్రత్తగా దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతున్న మది జీవితంలోకి రమ్య(ఆనంది) ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరికీ పెళ్లి కూడా అవుతుంది. హనీమూన్ పీరియడ్ ఎంతోకాలం ఉండదు కదా.. పైగా హీరోగారు దొంగాయె. మెల్లగా భార్యకు అనుమానం మొదలవుతుంది. ఈ ప్రపంచంలో ఉండే అందరూ భార్యలలాగే రమ్య గట్టిగా ఆరాలు తీస్తుంది.. కేకలు వేస్తుంది భర్త దొంగ అనే గుట్టువిప్పుతుంది. తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇద్దరూ విడిపోతారు అనుకున్నారా.. ? ఇలా జరిగితే రొట్ట కథ రొటీన్ కథ అవుతుంది. ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటి .. వీరి జీవితాల్లోకి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఏదో సాధించాలనుకుని ఉవ్విళ్ళూరుతున్న ఆశా మేరీ(సుమ కనకాల) ఎందుకు తొంగి చూసింది. చూస్తే ఏం కనపడింది.. తర్వాత ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగతా కథ.. ఇప్పుడు ఐబొమ్మ కూడా లేదు కాబట్టి సినిమా హాల్లో చూసి తెలుసుకోవాలి.
కామెడీ ఎంటర్టైనర్ కు కావాల్సిన సరుకు అంతా కథలో ఉంది. ప్రియదర్శి పాత్ర పర్మనెంట్ గా దొంగగా ఉండిపోవాలని అనుకోడు కానీ కొన్ని కుటుంబ సమస్యల వల్ల దొంగతనాలు కొనసాగించాల్సి వస్తుంది. తీరా దొంగతనాలు ఆపేద్దాం అనుకున్న సమయంలోనే ఆపలేని పరిస్థితులు ఎదురవుతాయి. మరోవైపు హీరోయిన్ పాత్ర థ్రిల్ థ్రిల్ అంటూ చేసిన హంగామా కిక్ సినిమాలో రవి తేజ పోషించిన పాత్ర ను గుర్తుకు తెస్తుంది కానీ ఈ సినిమాలో హీరోయిన్ కు సూటయింది. చాలా చోట్ల కామెడీ వర్క్ అవుట్ అయింది. డైలాగ్స్ బాగున్నాయి. చాలా చోట్ల ప్రేక్షకులను నవ్వించాయి. వేదనా భరితమైన టర్నులు తీసుకోకుండా కథనాన్నివీలైనంత ఎంటర్టైనింగ్ గా నడిపించాడు దర్శకుడు. మధ్యలో అతిథి పాత్రల్లో మెరిసిన జర్నలిస్ట్ మూర్తి, సోషల్ మీడియా సెన్సేషనల్ జంట దువ్వాడ-దివ్వెల ఉన్న సీన్లు అసందర్భంగా అనిపించకుండా ప్రేక్షకులకు చిరునవ్వులు పంచడం ఒక విశేషమనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంత క్రిస్ప్ గా ఉన్నట్టు అనిపించినా సెకండ్ హాఫ్ లో మాత్రం కొంత ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది. దాంతో అక్కడక్కడా ల్యాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమాలో ఎంటర్టైన్మెంట్ మాత్రం కంటిన్యూ అయింది.
లియోన్ జేమ్స్ మ్యూజిక్ సినిమా థీమ్ కు తగ్గట్టుగా బాగుంది కానీ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ లౌడ్ నెస్ ఎక్కువయింది. పాటలు కూడా సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. విశ్వనాథ రెడ్డి సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
ప్రియదర్శి, ఆనందిల కెమిస్ట్రీ బాగుంది. ముఖ్యంగా రమ్య పాత్రలో ఆనంది పెర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆశా మేరీ పాత్రలో సుమ కనకాల నటన అద్భుతం అని చెప్పలేం కానీ కథలో కీలకమైనది. సుమ చక్కగా నటించింది. హెడ్ కానిస్టేబుల్ పాత్రలో సుమ, ఎస్సై గా వెన్నెల కిషోర్ కాంబినేషన్ సీన్లు బాగున్నాయి. హైపర్ ఆది లాంటి ఇతర కమెడియన్స్ కూడా నవ్వులు పంచడంలో సాయపడ్డారు. గొప్ప సినిమా అని కాదు కానీ మరీ లాజిక్కులు వెతక్కుండా, కాసిన్ని నవ్వులు కావాలనుకునే వాళ్ళు హ్యాపీగా చూడొచ్చు.
– సినిమాలో బాగోలేనివి ఇవీ.
1. లౌడ్ గా ఉన్న నేపథ్య సంగీతం
2. కొంత డౌన్ అయిన సెకండ్ హాఫ్
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. ఆనంది నటన
2. ఎంటర్టైన్మెంట్
ఫైనల్ వర్డ్: కామెడీ డీసెంటే
రేటింగ్: 2.75/5