YSRCP Local Body Elections Boycott: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడుతుందా? అసలు నిలబడగలదా? కూటమి దూకుడును తట్టుకోగలదా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలుసు. ఒకవైపు వలంటీర్ల ఒత్తిడి, మరోవైపు వ్యవస్థల మద్దతు, కనీసం టిడిపి నేతలకు నామినేషన్ వేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. జిల్లా పరిషత్తులు ఏకంగా ఏకగ్రీవం అయ్యాయి. ఎంపీటీసీ స్థానాల్లో పోటీ లేకుండా పోయింది. పోలింగ్ బూత్ లకు వెళ్లి మరి ఓట్లు వేసుకున్న చరిత్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది. అటువంటి పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారింది. అధికారపక్షంగా తాము చేసిన వ్యవహారం తెలియంది కాదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు పాల్గొనక పోవచ్చు.
Also Read: పిఠాపురం వైసీపీ నుంచి వంగా గీత ఔట్!
గత ఎన్నికల కంటే భిన్నం..
2019లో గెలిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తరువాత అన్ని రకాల ఎన్నికల్లోనూ ఆ పార్టీదే హవా. అంతకుముందు 2006, 2013లో స్థానిక సంస్థల ఎన్నికలు( local body elections) జరిగాయి. ప్రత్యర్థులకు అప్పట్లో అవకాశం ఉండేది. 2006లో టిడిపి గణనీయమైన స్థానిక సంస్థలను సొంతం చేసుకుంది. 2013లో సైతం సత్తా చాటింది. కానీ 2021 లో మాత్రం తెలుగుదేశం పార్టీ కనీసం నామినేషన్లు కూడా వేయలేకపోయింది. అంతలా సాగింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా. తొలుత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. 80% వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. భయపెట్టి మరి పంచాయితీలను కైవసం చేసుకున్న సందర్భం వచ్చింది. అదే దూకుడుతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన ప్రభావం చూపింది. కనీసం రాజకీయ ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా చేసింది. నగరాలతో పాటు పట్టణాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వశం అయ్యాయి. చివరకు మండల పరిషత్తులతోపాటు జిల్లా పరిషత్తులు సైతం ఏకపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. అయితే ఇంతలా చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో అతి దారుణంగా ఓడిపోయింది.
Also Read: బయటకు వెళ్లొచ్చు.. ఆ ఇద్దరు నేతలకు జగన్ షాక్!
అధికార దుర్వినియోగం కామన్..
అయితే పులివెందుల( pulivendula ) జడ్పిటిసి ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. దానికి వైసీపీ చెబుతున్న కారణం అధికార పార్టీ అంతులేని అధికార దుర్వినియోగం. మరి అంతకుముందు వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావిస్తే మాత్రం.. అదంతా ప్రజాస్వామ్య యుతంగా జరిగినట్లు చెబుతోంది. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు.. కచ్చితంగా అప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పు చేసి ఉంటే.. పులివెందుల ఉప ఎన్నికల్లో సైతం టిడిపి కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్టే. అధికార పార్టీ తన ప్రభావం చూపినట్టే. దానిని పసిగడితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?