https://oktelugu.com/

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ లో కొత్త కోణం.. అడ్డంగా బుక్కయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

గతంలో ఐఎస్బీ లో పనిచేసిన ప్రణీత్ రావుకు రెండు గదులను కేటాయించారని, 17 కంప్యూటర్లు సమకూర్చారని విచారణలో తేలింది. ఆ కంప్యూటర్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ లు చేసేవారని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

Written By: , Updated On : March 27, 2024 / 07:36 AM IST
Phone Tapping Case

Phone Tapping Case

Follow us on

Phone Tapping Case: “రేవంత్ ఫోన్ ట్యాపింగ్ చేశారు . ఆయన ఇంటిపై ప్రత్యేక పరికరంతో నిఘా పెట్టారు. బీజేపీ నాయకుల ఫోన్లను కూడా వదలలేదు. ఎంతకు తెగించాలో అంతకు తెగించారు.. ఇప్పుడు వారందరి లీలలు బయటపడుతున్నాయి” కొద్దిరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో వినిపిస్తున్న వ్యాఖ్యలివి. అసలే రేవంత్ కోపం మీద ఉన్నాడు.. పైగా తవ్వుకుంటూ పోతుంటే బొచ్చెడు అక్రమాలు కనిపిస్తున్నాయి. ఇప్పట్లో అవి తేలేలా లేవు. కాళేశ్వరం నుంచి మొదలు పెడితే గొర్రెల పథకం దాకా ఎందులో చూసుకున్నా మరకలే. వీటిల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ కేసు. అప్పట్లో అధికార పార్టీ పెద్దల అండదండలు ఉన్న ఓ ఎమ్మెల్సీ ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్టు రాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో వారికి కీలక విషయాలు తెలియడంతో.. అతనిపై దృష్టి సారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇజ్రాయిల్ నుంచి టూల్స్, రిమోట్ యాక్సిస్ టూల్, ట్రోజన్ ర్యాట్ వంటి పరికరాల కొనుగోలుకు నిధులు మొత్తం ఆ ఎమ్మెల్సీ సమకూర్చాడని పోలీసులు అంతర్గతంగా పేర్కొంటున్నారు. ఈ పరికరాలను మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహాయంతో ఎస్ఐబీలో టెక్నికల్ కన్సల్టెన్సీ సేవలు అందించే రవిపాల్ అనే వ్యక్తి ద్వారా తెప్పించారని పోలీసులు తేల్చారు. వీటికి భారీగానే ఖర్చయిందని, అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్సీ నిధులకు ఏమాత్రం వెనకాడలేదని తెలుస్తోంది. పైగా పోలీస్ శాఖలో ఆ ఎమ్మెల్సీ మాట చెల్లుబాటు అయ్యేదని.. ఉన్నతాధికారులు కూడా ఆయన మాట జవదాటక పోయే వారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చారని, త్వరలో విచారించే అవకాశం ఉందని సమాచారం.

గతంలో ఐఎస్బీ లో పనిచేసిన ప్రణీత్ రావుకు రెండు గదులను కేటాయించారని, 17 కంప్యూటర్లు సమకూర్చారని విచారణలో తేలింది. ఆ కంప్యూటర్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ లు చేసేవారని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వార్ రూం లు ఏర్పాటు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు.. ఆయన ఇంట్లో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా పరికరాన్ని కూడా తెప్పించాలని దర్యాప్తు అధికారులు నీకు ప్రత్యేకంగా పరికరాన్ని కూడా తెప్పించారని దర్యాప్తు అధికారులు విచారణలో తెలుసుకున్నారు. అయితే ఆ ఎమ్మెల్సీ ఈ పరికరాల కోసం నిధులు ఎలా సమకూర్చుకున్నారు? భూ దందాలు చేశారా? సెటిల్మెంట్లకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఇజ్రాయిల్ దేశానికి నిధుల తరలింపు జరిగితే, కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టేవి. అయితే ఈ నిధులు మొత్తం హవాలా మార్గంలో తరలించారని ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర పోలీసులు కూడా ఈ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ హవాలా మార్గంలో నిధుల తరలింపు జరిగితే కచ్చితంగా ఈ వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఎంట్రీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విభాగం ఎంట్రీ ఇస్తే ఈ కేసు మరింత జటిలంగా మారుతుంది. రాష్ట్ర కేసు కాస్త జాతీయస్థాయి వ్యవహారమవుతుంది.

స్వామి కార్యం, స్వకార్యం

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తులో సరికొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. మాజీ డిఎస్పి ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సొంత దందాలు చేశారని తెలుస్తోంది. కొందరు వజ్రాలు, నగల వ్యాపారులను బెదిరించాలని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో హవాలా ఆపరేటర్ల నుంచి సీజ్ చేసిన నగదును స్వాహా చేశారని అనుమానాలు వినిపిస్తున్నాయి. ట్యాపింగ్ ను ఆసరాగా చేసుకుని స్థిరాస్తి వ్యాపారులు, సమాజంలో హోదా ఉన్న వారిని బెదిరించారు. వసూళ్లకు పాల్పడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు. దీంతో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. ఆ ముగ్గురు అధికారులు సర్వీసులో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు ఎంత కూడా పెట్టారు అనే విషయాలపై దృష్టి సారించింది. గత ప్రభుత్వంలో వీరు ఎక్కడెక్కడ పనిచేశారు? భూ దందాలకు పాల్పడ్డారా? బెదిరింపులకు గురి చేశారా? అప్పట్లో వీరిపై వచ్చిన ఆరోపణలు ఏమిటి? ఏమైనా కేసులు నమోదయ్యాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురితోపాటు ఇంకా కొంతమంది పోలీసు అధికారులపై కూడా ఏసీబీ నజర్ పెట్టిందని తెలుస్తోంది.

తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు ను పోలీస్ కస్టడికి ఇవ్వాలని.. వారిని విచారించి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉందని పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పోలీస్ అధికారుల తరఫు న్యాయవాదులు.. రెండు రోజుల గడువు అడిగారు. అయితే న్యాయస్థానం వారి వాదనలను తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. కౌంటర్ పిటిషన్ బుధవారం దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే కస్టడికి సంబంధించిన తీర్పును బుధవారం వెలువరించనుంది.