త్వరలో ప్రజా ప్రస్థానం పాద యాత్ర ప్రారంభిస్తామని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రకటించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల నుంచే పాదయాత్ర చేస్తామని తెలిపారు. అక్టోబర్ 20న ప్రజా ప్రస్థానం పాద యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమపాలన తేవడమే తన లక్ష్యమని ప్రకటించారు. పాదయాత్రలోను నిరుద్యోగ వారంలో భాగంగా మంగళవారం దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. పాదయాత్రతో ప్రజా సమస్యలను తెలుసుకుంటామని, ప్రజలకు అండగా ఉంటూ వారికి భరోసా కల్పిస్తామన్నారు. రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు.
తాను పత్రి మంగళవారం చేపడుతున్న నిరాహార దీక్షను పాదయాత్రలోనూ కొనసాగించనున్నట్లు స్ఫష్టం చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకు పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. పాదయాత్రకు వైఎస్ఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన ఆశయాలు సాధించేందుకే పాదయాత్ర చేయాలని సంకల్పించినట్లు షర్మిల తెలిపారు.