pakistan vs india : భీకరమైన ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. సత్తా చాటుతాడు అనుకున్న గిల్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ దారుణంగా నిరాశపరిచాడు. సంజు శాంసన్ అవసరమైన దశలో చేతులెత్తేశాడు. ఒకవైపు పాకిస్తాన్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. చేయాల్సిన పరుగులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇలాంటి దశలో నేనున్నాను.. నేను గెలిపిస్తాను అని టీమ్ ఇండియా బరువు బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నాడు తిలక్ వర్మ. ఆరడుగుల ఎత్తు.. అంతకు మించిన దమ్ముతో దుమ్మురేపాడు. పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అసాధ్యం అనుకున్న విజయాన్ని సాధ్యం చేసి అదరగొట్టాడు.
After India won Elon Musk has changed the like button, try it
Congratulations team India
INDIA'S HERO – TILAK VARMA! #AsiaCupFinal #INDvsPAK #Asiacupfinal2025 #tilakvarma #tilakverma #rinkusingh #AsiaCupT20 pic.twitter.com/u2QfLuddwk
— Gaurav (@Gaurav_truth) September 28, 2025
తోటి ఆటగాళ్లు విఫలమైన చోట.. పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోతున్నచోట.. తిలక్ వర్మ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తనను ఎందుకు ప్రమాదకరమైన ఆటగాడు అంటారో మరోసారి నిరూపించుకున్నాడు. ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీకి ఒక పరుగుదూరంలో నిలిచిపోయినప్పటికీ.. ఆ బాధను పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా భర్తీ చేసుకున్నాడు. కష్ట కాలంలో జట్టుకు ఆపద్బాంధవుడుగా నిలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సమయోచితంగా బ్యాటింగ్ చేసి.. మూడు సిక్సర్లు, మూడు బౌండరీల సహాయంతో అర్థ శతకం సాధించాడు. మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమ్ ఇండియాకు తిలక్ వర్మ ఒక రకంగా ఆపద్బాంధవుడుగా నిలిచాడు. సంజు తో కలిసి నాలుగో వికెట్ కు 57 పరుగులు.. శివం దుబే తో కలిసి ఐదో వికెట్ కు 53*(ఈ కథనం రాసే సమయం వరకు) పరుగులు జోడించాడు.
వాస్తవానికి పిచ్ బౌలర్లకు విపరీతంగా సహకరిస్తున్నది. ఈ దశలో బంతిని దొరకబుచ్చుకొని ఆడాలంటే బ్యాటర్లకు తలప్రాణం తోకకు వస్తోంది. ఇలాంటి దశలో నిదానంగా బ్యాటింగ్ చేస్తూ.. అవసరమైన సందర్భాలలో భారీ షాట్లు కొడుతూ ఆకట్టుకున్నాడు తిలక్ వర్మ. భీకరమైన ఫామ్ లో ఉన్న ప్లేయర్లు మొత్తం విఫలమవుతుంటే.. అతడు మాత్రం జట్టు కోసం నిలబడ్డాడు. ఆపద్బాంధవుడు పాత్ర పోషించి.. జట్టు విజయంలో ముఖ్యభూమికను వహించాడు. పాకిస్తాన్ బౌలర్లు అభిషేక్ శర్మ, గిల్, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ వంటి వారిని అవుట్ చేసినప్పటికీ.. తిలక్ వర్మను వెనక్కి పంపించడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి.. టీమిండియాకు మర్చిపోలేని కానుకను అందించాడు. తెలుగోడి సత్తా ఎలా ఉంటుందో అంతర్జాతీయ వేదిక ముందు మరోసారి నిరూపించాడు. అన్నట్టు ఈ ఏడాది దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్లో తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన విషయం తెలిసిందే.