Pakistan Politics : పాకిస్థాన్‌లో రాజకీయ ఉత్కంఠ పతాకస్థాయికి చేరింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించారనే వార్తలతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రావల్పిండి జైలు వద్ద, పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చెలరేగాయి. వేలాది మంది ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజలు జైలు వద్దకు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఇమ్రాన్ బతికే ఉన్నారు!
ఆందోళనలు తీవ్రం కావడంతో సైన్యం తొలిసారి భయపడి ఒత్తిడికి తలొగ్గి ఇమ్రాన్ ఖాన్ సోదరిని జైలులోకి పంపించింది. ఆమె ఇమ్రాన్‌ను కలుసుకున్న తర్వాత, “ఇమ్రాన్ ఖాన్ సజీవంగా, సురక్షితంగా ఉన్నారు. కాస్త నీరసంగా ఉన్నప్పటికీ, ఆయన మానసికంగా చాలా బలంగా ఉన్నారు” అని ధృవీకరించారు. దీంతో ఇమ్రాన్ మరణంపై చెలరేగిన వదంతులకు తెరపడింది. ఆయన ఆరోగ్యంపై ఉన్న ఆందోళన తాత్కాలికంగా సద్దుమణిగింది.
ఆర్మీ చీఫ్ పదవి ఖాళీ
మరోవైపు, పాకిస్థాన్ ఆర్మీలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడే ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పదవీకాలం నవంబర్ 28తో ముగిసింది. ఆయన్ను ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’గా అప్‌గ్రేడ్ చేయడానికి రాజ్యాంగ సవరణ చేపట్టారు. అయితే, దీనిపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
షరీఫ్ సోదరుల స్కెచ్?
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తన సోదరుడు నవాజ్ షరీఫ్ ప్రస్తుతం ప్రవాస జీవితం గడుపుతున్న లండన్ కు వెళ్లాడు. ఈ పర్యటనకు వెళ్లడంతో ఈ నియామక ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో గత ఐదు రోజులుగా పాక్ ఆర్మీ చీఫ్ పదవి ఖాళీగా ఉంది. ఆసిమ్ మునీర్‌ను అప్‌గ్రేడ్ చేయకుండా, అతని పదవిని హోల్డ్‌లో పెట్టడం వెనుక ప్రధాని షెహబాజ్, నవాజ్ షరీఫ్ ల పన్నాగం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసిమ్ మునీర్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు షరీఫ్ సోదరులు వ్యూహం రచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏం జరగనుంది?
ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నారనే వార్త ఆయన మద్దతుదారులకు ఊరటనివ్వగా.. మరోవైపు శక్తివంతమైన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పదవిపై ప్రధాని షరీఫ్ వ్యవహరించిన తీరుతో దేశంలో రాజకీయ అనిశ్చితి, సైనిక వర్గాలలో ఆందోళన మరింత పెరిగింది. ఈ పరిణామాలు పాకిస్థాన్ రాజకీయాలలో కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంది. తదుపరి ఆర్మీ చీఫ్‌గా ఎవరు నియమితులవుతారు? షరీఫ్ సోదరుల వ్యూహం ఏంటి? ఇమ్రాన్ ఖాన్ పాత్ర ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు పాక్ రాజకీయాలను చుట్టుముట్టాయి.