Over-the-counter cough syrup ban : సాధారణంగా కొద్దిగా జలుబు, దగ్గు రాగానే చాలామంది చేసే మొదటి పని.. పక్కనే ఉన్న మెడికల్ షాపునకు వెళ్లి ఒక దగ్గు సిరప్ (Cough Syrup) బాటిల్ కొనుక్కోవడం. కానీ ఇకపై ఆ పప్పులు ఉడకవు. మీ దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే కెమిస్ట్లు మీకు దగ్గు సిరప్ ఇస్తారు. దేశంలో కల్తీ దగ్గు సిరప్‌ల కారణంగా వరుసగా చోటుచేసుకుంటున్న విషాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 16న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డ్రగ్స్ రూల్స్-1945లో కీలక సవరణలు చేస్తూ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
నియంత్రణలోకి ‘సిరప్‌లు’.. లాజెంజ్‌లకు మినహాయింపు!
ఇప్పటివరకు దగ్గుకు సంబంధించిన సిరప్‌లు, టాబ్లెట్లు, లాజెంజ్‌లు, పిల్స్ వంటివి ఓవర్-ది-కౌంటర్ (OTC) కింద ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే సులభంగా లభించేవి. అయితే తాజా సవరణల ద్వారా ప్రభుత్వం మినహాయింపు జాబితా నుండి ‘సిరప్‌లు’ (Syrups) అనే పదాన్ని తొలగించింది. ప్రభుత్వం కేవలం ‘లిక్విడ్ సిరప్‌ల’ అమ్మకాలపైనే ఈ నియంత్రణ విధించింది. దగ్గుకు వాడే టాబ్లెట్లు, పిల్స్, లాజెంజ్‌లు (బిళ్ళలు) మాత్రం ఎప్పటిలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో దొరుకుతాయి.
ఈ కఠిన నిర్ణయానికి కారణం ఏమిటి?
గత కొంతకాలంగా కల్తీ దగ్గు సిరప్‌ల వల్ల దేశ, విదేశాల్లో సంభవిస్తున్న మరణాలే కేంద్రం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం. గత ఏడాది సెప్టెంబర్‌లో మధ్యప్రదేశ్‌లో కల్తీ దగ్గు సిరప్ సేవించడం వల్ల కనీసం 24 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2022 నుండి భారతదేశంలో తయారై విదేశాలకు ఎగుమతి అయిన కొన్ని దగ్గు సిరప్‌ల వల్ల ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో 140 మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. ఇది అంతర్జాతీయంగా భారత ఔషధ రంగ ప్రతిష్టపై ప్రభావం చూపింది.
ఈ నేపథ్యంలో మందుల నాణ్యత, భద్రతపై రాజీ పడకూడదని భావించిన కేంద్రం.. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ మార్పులు చేసింది. 2025 డిసెంబర్‌లోనే దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రజలు, ఫార్మా సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఈ తుది నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రజలకు తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ సుదీర్ఘ కాలంలో ఇది ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సొంత వైద్యం తగ్గడంతో పాటు, నకిలీ, కల్తీ మందుల మాఫియాకు ఈ నిర్ణయంతో అడ్డుకట్ట పడనుంది. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల యాజమాన్యాలు కూడా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
