NZ vs SL Match Highlights : పాపం శ్రీలంక! సొంతగడ్డపై తమ ఊరి గల్లీల్లో ఆడినట్టు ఆడుతారనుకుంటే.. కివీస్ బౌలర్ల ధాటికి అడ్రస్ లేకుండా పోయారు. ఒకప్పుడు లంక అంటే బ్యాటర్లకు భయం ఇప్పుడు లంక బ్యాటర్లకే పిచ్ అంటే భయం అన్నట్టు తయారైంది పరిస్థితి.
వరల్డ్ కప్‌లో సెంచరీ కొట్టిన వీరుడు నిశాంక ఈ మ్యాచ్‌లో మాత్రం ‘సున్నా’ దగ్గర ఆగిపోయి “అతిథి మర్యాద” అంటే ఇదేనని నిరూపించుకున్నాడు. డకౌట్ అయి పెవిలియన్‌కు వెళ్తుంటే అభిమానులు పాపం కళ్లు కాయలు కాచేలా చూశారు. కివీస్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర బౌలింగ్ చేస్తుంటే శ్రీలంక బ్యాటర్లు ఏదో కొత్త బంతిని చూస్తున్నట్టు బిత్తరపోయారు. 4 వికెట్లు తీసి లంక ఇంట ‘రచ్చ’ లేపాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకోవడమే కాదు. లంక సెమీస్ ఆశల మీద నీళ్లు చల్లేశాడు.
ఇక చిత్తుగా ఓడుతుందనుకున్న దశ నుంచి కివీస్ ను కెప్టెన్ శాంటర్న్, ఆల్ రౌండర్ మెక్ కాంచి ఏకంగా గెలిపించేశారు. సాంట్నర్ – మెక్‌కాంచి 84 పరుగులకే 6 వికెట్లు పడితే.. “అమ్మయ్య కివీస్ పని అయిపోయింది” అని సంబరపడ్డ లంక ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ఏడో వికెట్‌కు వాళ్లు చేసిన 84 పరుగులు చూస్తుంటే లంక బౌలర్లకు దారి దొరకలేదని అర్థమవుతోంది.శ్రీలంక నిష్క్రమణతో ఇప్పుడు అసలు సినిమా మొదలైంది. గ్రూప్-2లో సెమీస్ బెర్తు కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య “మ్యూజికల్ చైర్స్” ఆట మొదలైంది.
న్యూజిలాండ్ ఇప్పుడు ఇంగ్లాండ్‌ను ఓడిస్తే చాలు.. నేరుగా సెమీస్‌లోకి దూసుకెళ్తారు. పాక్‌ను ఎయిర్‌పోర్ట్ దాకా సాగనంపుతారు. పాకిస్థాన్ పరిస్థితి ఎప్పుడూ ఇంతే! పక్కింటి వాడు ఓడిపోవాలి, పైనుంచి వర్షం పడాలి.. ఇలాంటి ‘ప్రార్థనల’ మీదే ఆధారపడాలి. కివీస్ గెలిస్తే పాక్ ప్యాకప్ చెప్పాల్సిందే.
“శ్రీలంక జట్టు ఇంటికి వెళ్లడం ఖాయమైంది, కానీ వెళ్తూ వెళ్తూ పాకిస్థాన్‌ను కూడా తోడు తీసుకెళ్తుందా? లేక కివీస్ ఆ పనిని ముందే కానిస్తుందా? అనేది చూడాలి!”