
మహిళా కానిస్టేబుల్ పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు దుండగులు ఆపై వీడియో తీసి బెదిరించిన ఘటన మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో జరిగింది. ఈనెల మొదట్లోనే దారుణం జరగ్గా బాధితురాలు ఈనెల 13న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడి తల్లి సహా ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు, అతడి తల్లిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం 30 ఏళ్ల బాధిత కానిస్టేబుల్ కు నిందితుడు ఫేస్ బుక్ లో పరిచమయ్యాడు.
ఏప్రిల్ నుంచి వాట్సాప్ ద్వారా తరచూ చాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తన సోదరుడి పుట్టిన రోజు వేడుకకు రావాలంటూ బాధితురాలని అహ్వానించాడు. అతడి మాటలు నమ్మి వెళ్లిన బాధితురాలిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పార్టీలో తనపై ప్రధాన నిందితుడు, అతడి సోదరుడు, మరో వ్యక్తి కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
అలాగే, ఈ ఘటనను వీడియో తీసినట్లు కూడా ఆరోపించింది. ప్రధాన నిందితుడి తల్లి తనను బెదిరించిందని, వారి బంధువు ఒకరు తనను చంపేస్తానని బెదిరించడమే కాకుండా డబ్బులు కూడా గుంజుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. బాధిత కానిస్టేబుల్ తొలుత నీముచ్ లో పనిచేసిందని, ప్రస్తుతం ఇండోర్ జిల్లాలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.