Revanth Chandrababu : తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ.. ఇప్పటికి ఇక్కడ రాజకీయాలు చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు గురించి పెద్దగా తెలంగాణ నాయకులు పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అధికారంలో లేడు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబును ప్రతి సందర్భంలో కేసీఆర్ బూచి గా చూపించారు. తెరపైకి ఓటుకు నోటు అనే కేసును తీసుకొచ్చి చంద్రబాబును ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం చేశారు. 2019 నుంచి 2024 వరకు ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగారు. నాడు జగన్మోహన్ రెడ్డికి కేసిఆర్ అనేక రకాలుగా మేళ్లు చేశారు. ప్రగతి భవన్ పిలిపించుకున్నారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ఆహ్వానించారు. ఇవన్నీ అప్పటి రోజులు..
ఇప్పుడు తెలంగాణలో పవర్ సెంటర్ కాంగ్రెస్ చేతిలో ఉంది.. కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా అంటేనే గులాబీ పార్టీకి నచ్చదు. అందువల్లే రేవంత్ రెడ్డి ఏం చేయకపోయినా సరే విమర్శిస్తూనే ఉంటుంది. దానికి చంద్రబాబు ప్రస్తావన జతచేస్తూ ఉంటుంది. పైగా సెంటిమెంట్ రాజకీయాలను రగిలిస్తూ ఉంటుంది.. ఆ మంటల్లో చాలికాచుకుంటూ ఉంటుంది గులాబీ పార్టీ. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణహిత నదికి వరద వస్తోంది. ఇంతటి కరువు కాలంలో కూడా ప్రాణహిత నదికి వరదరావడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ వరద నీరు వృధాగా వెళుతుంది.
వాస్తవానికి మేడిగడ్డ బ్యారేజీలు కృంగిపోక పోతే.. మిగతా పంప్ హౌస్ లు సక్రమంగా ఉండి ఉంటే ఈ నీటిని నిలువ చేసుకునే అవకాశం ఉండేది. కరువుకాలంలో ఎల్లంపల్లి.. ఎస్ ఆర్ ఎస్ పి వంటి ప్రాజెక్టులను నింపే అవకాశం ఉండేది. మేడిగడ్డలో బ్యారేజీ కుంగిపోవడం.. మిగతా సుందిళ్ల.. అన్నారం.. కన్నెపల్లి పంప్ హౌస్ లు కూడా పనికిరావని చెబుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లను రన్ చేయడం లేదు. వచ్చిన నీటిని వచ్చినట్ట కిందికి వదిలిపెడుతోంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పంప్ చేసిన నీళ్లను వృధాగా సముద్రంలోకి పంపించిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇంతవరకు కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ని టీఎంసీల నీరు పంప్ చేశారు అనేదానికి అధికారిక లెక్కలు లేవు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మించిన బ్యారేజీలు.. ఇతర పంప్ హౌస్ లు ప్రమాదకరమైన స్థితిలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మరమ్మతులు చేసిన తర్వాత వాడాలని భావిస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. అయితే గులాబీ పార్టీ ఇందులో కూడా రాజకీయం చేస్తోంది. ఇప్పుడు వరద నీరు వస్తున్న నేపథ్యంలో.. దానిని సక్రమంగా వాడకుండా.. రేవంత్ రెడ్డి గురుదక్షిణగా ఆ నీటిని ఏపీకి వదిలేస్తున్నాడని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ.
వాస్తవానికి వచ్చిన వరద నీరు కిందికి వెళ్లడం సహజం. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం సక్రమంగా పనిచేస్తే ఆ నీటిని నిలువ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలు.. పంప్ హౌస్ లు సక్రమంగా పనిచేయకపోవడంతో.. ఆ నీటిని వృధాగా కిందికి వదిలివేయాల్సి వస్తోంది. ఫలితంగా పోలవరం ప్రాంతంలో గోదావరి ప్రవాహం ఉదృతంగా ఉంది. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ నీరు నిల్వచేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడే గులాబీ పార్టీ గొప్ప రాజకీయాలు చేస్తోంది. మేడిగడ్డను మరమ్మతులు చేయకుండా ఆ నీటిని చంద్రబాబుకు గురుదక్షిణ గా రేవంత్ రెడ్డి వదిలేస్తున్నారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. వాస్తవానికి పోలవరం పథకం పూర్తికానప్పుడు ఆ నీటిని చంద్రబాబు ఏం చేసుకుంటారు.. ఒకవేళ చంద్రబాబు కోసం ఆ నీటిని రేవంత్ రెడ్డి వదిలిపెడితే.. ఇక్కడి ప్రజలు క్షమిస్తారా.. సొంత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఊరుకుంటారా.. పాపం ఈ మాత్రం సోయి కూడా గులాబీ పార్టీకి లేకపోవడం అత్యంత దారుణం.
