Medaram Jatara : దట్టమైన అడవి.. పక్కనే చిలకలగుట్ట.. చెంతనే జంపన్న వాగు.. అలాంటి చోట వెలిశారు సమ్మక్క, సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు.. తాము వెలసిన ప్రాంతానికి మేడారం అని పేరు పెట్టుకున్నారు. ఏ ముహూర్తంలో అయితే ఆదివాసి దేవతామూర్తులు తమ ప్రాంతానికి మేడారం అని పేరు పెట్టుకున్నారో.. అప్పటినుంచి ఆ ప్రాంతం భక్తజనం గుడారంగా మారిపోయింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర కన్నుల పండువగా సాగుతూ ఉంటుంది. లక్షల మంది భక్తులు ఈ జాతరకు వస్తూ ఉంటారు. తద్వారా ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరు తెచ్చుకుంది.
మేడారంలో సమ్మక్క, సారలమ్మ కు ప్రత్యేకంగా విగ్రహాలు ఉండవు. అక్కడ గంటలు కూడా మోగవు. వేదమంత్రాలు మచ్చుకు కూడా వినిపించవు. అక్కడ ఉన్నది కేవలం ప్రకృతి మాత్రమే. అ ప్రకృతిలోనే ఆ ఆదివాసి దేవతామూర్తులు కొలువై ఉన్నారు. వాస్తవానికి మేడారాన్ని చాలామంది ఒక జాతరలాగా భావిస్తుంటారు. ఉత్సవం లాగా పేర్కొంటారు. కానీ అక్కడ జరిగేది అంతకుమించి. ఒక రకంగా చెప్పాలంటే లక్షల మంది భక్తుల హృదయాలను కదిలిస్తుంది మేడారం. వారిలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది ఆ ఉత్సవం. అందువల్లే సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి భక్తులు వస్తుంటారు. గద్దెల వద్ద బంగారాన్ని సమర్పించి తమ మొక్కలు. తీర్చుకుంటారు.
మేడారంలో ధీర వనితలుగా సమ్మక్క, సారలమ్మ రూపాంతరం చెందడం వెనుక అనేక కథలు ఉన్నాయి. ముఖ్యంగా కాకతీయ సేనలను ఎదిరించడంలో సమ్మక్క వీరత్వాన్ని ప్రదర్శించింది. తమ జాతి కోసం పోరాటాన్ని చేసింది. అందువల్లే ఆదివాసీలు సమ్మక్కను తమ ఇంటి ఆడబిడ్డగా కొలుస్తూ ఉంటారు. వీరత్వానికి సారలమ్మను ప్రతీకగా భావిస్తుంటారు. కాకతీయ సేనలకు వ్యతిరేకంగా సమ్మక్క కత్తి దూసింది. తమ ప్రాంత ప్రజలను కాపాడేందుకు వీర వనితగా అవతరించింది. కొలిచి మొక్కితే కోరికలు తీర్చే తల్లిగా సారలమ్మ రూపాంతరం చెందింది. ఇక సమ్మక్క సోదరి నాగులమ్మ కూడా ఇక్కడ విశేషమైన పూజలు అందుకుంటుంది. సమ్మక్క సోదరి నాగులమ్మ పగిడిద్దరాజును వివాహం చేసుకున్నట్టు ఇక్కడ గిరిజనులు చెబుతుంటారు.
కాకతీయులతో నాడు జరిగిన పోరాటంలో నాగులమ్మ వీరోచితంగా పోరాడింది. ఆ తర్వాత సంపెంగ వాగు (ఇప్పుడు జంపన్న వాగు) లో ఆమె వీరమరణం పొందారు. ఆమె జ్ఞాపకార్థం అక్కడ గద్దె నిర్మించారు. మేడారం జాతర సందర్భంగా తొలి పూజలను నాగులమ్మకే చేస్తారు. నాగులమ్మ గద్దె వద్ద పూజలు చేసిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతుంటారు. అందువల్లే సంతానం లేని వాళ్ళు ఆ గడ్డి వద్ద విశిష్టమైన పూజలు చేస్తారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి.. సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు.