Good news for Visakhapatnam: విశాఖ పై( Visakhapatnam) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. నగరంలో పరిశ్రమల ఏర్పాటుతో పాటు పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. ముఖ్యంగా నగరంలో తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మరో 10 ఏళ్లలో నగరం విస్తరించి. లక్షలాదిమంది ఉద్యోగులు విశాఖకు రానున్నారు. కుటుంబాలతో నివాసం ఉండనున్నారు. వారందరికీ మౌలిక వసతులు పెంచేలా కార్యాచరణ రూపొందిస్తోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మధురవాడ, కాపులుప్పాడలో వసతులు మెరుగుపరచాలని చూస్తోంది. మధురవాడ జోన్లోని 5, ఆరు వార్డుల ప్రజలకు తాగునీటి కష్టాలు దూరం కానున్నాయి. త్వరలో కొత్త రిజర్వాయర్ అందుబాటులోకి రానుంది..
మధురవాడ ప్రాంతంలో..
మధురవాడ( Madhurawada ) ప్రాంతంలో నీటి ఎద్దడి నియంత్రణకు గాను వైసీపీ ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద రూ.3.5 కోట్లతో పనులు ప్రారంభించింది. కానీ నిధులు విడుదల చేయకపోవడంతో ఆ పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించింది. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు, రిజర్వాయర్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేసింది. దీంతో పనులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి.
50వేల మందికి తాగునీరు..
విశాఖలో ప్రధానంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దాదాపు 50 వేల మంది జనాభాకు తాగునీరు అందుతుంది. ప్రధానంగా మధురవాడ పరిధిలోని సాయిరాం కాలనీ ఫేజ్ 1, 2,3, శ్రీనివాస్ నగర్, ఎస్ టి బి ఎల్ ధియేటర్, డ్రైవర్స్ కాలనీ, జిసిసి లేఅవుట్, వైభవ్ నగర్, ప్రశాంతి నగర్, కొమ్మాది, హౌసింగ్ బోర్డ్ కాలనీ, అమరావతి కాలనీ, సేవా నగర్, దేవి మెట్ట, రిక్షా కాలనీ ప్రాంతాలకు నీటి సరఫరా మెరుగు పడనుంది. గతంలో కొండవాలు ప్రాంతాల్లో నివాసం ఉండేవారు నీటి కోసం కటకట లాడే వారు. కానీ ఇప్పుడు ఈ రిజర్వాయర్ అందుబాటులోకి వస్తే ఈ ఏడాది వేసవి గట్టెక్కినట్టే.