
ఛత్తీస్ గఢ్ దండకార్యణ్యంలో తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఓ మావోయిస్టు చనిపోయాడు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతాగుఫా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 150,131 బెటాలియన్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందినట్లు ఎస్సీ సునీల్ శర్మ ధృవీకరించారు.