సంక్రాంతికి, సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) కి ఉన్న సంబంధం మామూలుది కాదు. ఆయన కెరీర్ లో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ సంక్రాంతి సీజన్ లోనే వచ్చాయి. ఆయన నుండి చివరిగా విడుదలైన సంక్రాంతి చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. ఈ సినిమా తర్వాత వెంటనే ఆయన రాజమౌళి ‘వారణాసి’ మూవీ కి డేట్స్ ఇచ్చేసాడు. ఒకవేళ ‘వారణాసి’ మధ్యలో లేకపోయుంటే , ఈ సంక్రాంతికి మహేష్ బాబు నుండి ఒక సినిమా వచ్చేదేమో. అయితే ఆయన నుండి ఎలాంటి సినిమా రాకపోయినా, సినిమాని ఆడియన్స్ కి సరికొత్త అనుభూతి ఇచ్చే థియేటర్స్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ లో AMB సినిమాస్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రంగం లోకి అడుగుపెట్టాడు.
AMB సినిమాస్ హైదరాబాద్ లోనే ది బెస్ట్ మల్టీప్లెక్స్ గా పేరు తెచ్చుకుంది. త్వరలోనే ఆయన హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో AMB క్లాసిక్ సినిమాస్ ని కూడా ప్రారంభించబోతున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే బెంగళూరు లో కూడా ఆయన ఏషియన్ సినిమాస్ తో కలిసి AMB సినిమాస్ ని మొదలు పెట్టాడు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మల్టీప్లెక్స్ లో ఈ నెల 16 నుండి సినిమాలు ప్రదర్శితమవుతాయని మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. సౌత్ ఇండియా లోనే మొట్టమొదటి డాళ్బీ స్క్రీన్స్ ని పరిచయం చేయబోతున్నందుకు గర్వం గా ఉందని, త్వరలోనే కర్ణాటక ప్రజలను కలుసుకుంటానని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. ఇలా కేవలం హైదరాబాద్, బెంగళూరు సిటీస్ లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ, అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాల్లోనూ AMB సినిమాస్ వెలవబోతున్నాయి.
ఇక ‘వారణాసి’ మూవీ విషయానికి వస్తే, ఈ సినిమా షూటింగ్ ఎలాంటి గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. #Globetrotter ఈవెంట్ తో ప్రపంచం లోని సినిమా అభిమానులంతా ‘వారణాసి’ మూవీ గ్లింప్స్ ని చూసేలా చేసాడు రాజమౌళి. ఎప్పటి లాగానే ఆయన విజన్ కి సినీ అభిమానులు చేతులెత్తి దండం పెట్టారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే ఏడాది శ్రీ రామనవమి కి ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక మహేష్ బాబు కి తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నాడు, రీసెంట్ గానే ఆయన షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు.