Hospital Scam : శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా చూశారా. అందులో చిరంజీవి అప్పటికప్పుడు ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తాడు. కృత్రిమంగా రోగులను తీసుకొస్తాడు. తనను తాను ఒక డాక్టర్ గా పరిచయం చేసుకుంటాడు. తన తల్లిదండ్రులను తెలివిగా బురిడీ కొట్టిస్తుంటాడు. ఇదంతా చూసే ప్రేక్షకులకు వినోదంలాగా ఉంటుంది. కానీ ఇదే నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది.. అచ్చం మధ్యప్రదేశ్ లో ఇలా జరిగింది. దీని వెనుక కోట్ల వ్యవహారం ఉంది. చివరికి వెలుగులోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యపోవడం ప్రభుత్వం వంతయింది.
మధ్యప్రదేశ్లో ఇండోర్ అనే నగరం ఉంది. ఇక్కడ కజ్రానా అనే ప్రాంతంలో ఒక హాస్పటల్ ఉంది. ఏకంగా 87 మంది సిబ్బంది పని చేస్తున్నారు. రోగుల కోసం వంద పడకలు ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రి బాగా నడుస్తోంది.. రోగులకు అద్భుతంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం కూడా భావించింది. ప్రతి ఏడాది ఈ హాస్పిటల్ కు బడ్జెట్లో కేటాయింపులు జరుపుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు సంగతి తెలియడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. గుడ్లు తేలేసి వింతగా చూసింది.
ఇండోర్ లో కజ్రానా ప్రాంతంలో అసలు హాస్పిటల్ లేదు. గడచిన ఆరు సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ కేవలం పేపర్ మీద మాత్రమే ఉంది. ఇప్పటివరకు అక్కడ ఒక్క ఇటుక కూడా వెయ్యలేదు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మొత్తం వేరువేరు లోకేషన్ లలో ఉన్నారు. ఆ ప్రాంతాలలోనే వారు పని చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం వైద్య ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో అధికారులకు ఈ వ్యవహారం తెలిసింది. ప్రభుత్వానికి సంబంధించి జవాబుదారీతనం లేకపోవడం.. అసమర్ధత.. అవినీతి వల్ల ఇటువంటి వ్యవహారాలు జరుగుతుంటాయని అక్కడి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. గడచిన ఆరు సంవత్సరాలుగా వైద్య సిబ్బంది వేరువేరు లోకేషన్లో పనిచేస్తూ.. దర్జాగా జీతాలు తీసుకుంటూ.. కోట్లకు కోట్లు వెనకేసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని అక్కడి ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
కేవలం పేపర్ల మీద హాస్పిటల్ ఉంది. రోగులకు సేవలు కూడా అందలేదు. హాస్పిటల్ నిర్మించాల్సిన ప్రాంతం ముళ్ళ పొదలతో కనిపిస్తోంది. ఇంతకు మించిన దరిద్రం ఇంకొకటి ఏమంటుంది. వాస్తవానికి ఇలాంటి వ్యవహారాలు ఆలస్యంగా వెలుగులోకి రావడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అక్కడి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది

