Kavitha KCR : ఈ ప్రశ్న పొలిటికల్ వర్గాల్లో విస్తృతమైన చర్చకు దారితీస్తోంది. సోమవారం మీడియా సమావేశంలో గులాబీ అధినేత్రి కవిత సంచలన ఆరోపణలు చేసిన తర్వాత మరింత చర్చనీయాంశం అవుతున్నది. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం అప్పటి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గులాబీ పార్టీకి మేమే ఓనర్లమని చేసిన ఒక వ్యాఖ్య రాజకీయంగా సంచలనం సృష్టించింది. దానిపై గులాబీ అధినేత తీవ్రంగా స్పందించారు. ఎప్పుడైతే రాజేందర్ ఆ మాటలు మాట్లాడారో.. తెరపైకి భూముల కబ్జా కేసు వచ్చింది. ముఖ్యమంత్రికి అప్పటికప్పుడు కొందరు రైతులు లేఖ రాసినట్టు సీఎం ఓ పేర్కొంది. దానిపై చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించడమే కాదు.. అత్యంత అవమానకరంగా తన సొంత మీడియాలో అడ్డగోలుగా వార్తలు రాయించాడు గులాబీ దళపతి.
రాజేందర్ వ్యవహారం తెలంగాణలో పెను ప్రకంపనలు సృష్టించింది. రాజేందర్ మాత్రమే కాదు.. నరేంద్ర, విజయశాంతి, రాములు నాయక్.. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ బయటికి పంపించిన నాయకుల జాబితా చాలా పెద్దది. ఎందువల్ల వారిని బయటికి పంపించాడు.. ఎందుకోసం పంపించాడు అనేది బహిరంగ సత్యమే. కాకపోతే తెలంగాణ సమాజం కేసిఆర్ ను ఓన్ చేసుకుంది కాబట్టి ఆ పరిణామాలను పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే ఈటెల రాజేందర్ వ్యవహారాన్ని తెలంగాణ సమాజం సీరియస్ గా తీసుకుంది. దీని అంతటి కారణం కేసీఆర్ అని బలంగా నమ్మింది. అందువల్లే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టింది.
ఇప్పుడు పార్టీ నాయకత్వంపై సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె విమర్శలు చేస్తోంది. అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది. అంతకంటే ముందు లేఖలు కూడా రాసింది. కెసిఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇంత జరిగినప్పటికీ కవిత మీద ఎటువంటి చర్యలు లేవు. పైగా సోమవారం నాటి వ్యాఖ్యల తర్వాత గులాబీ పార్టీకి సంబంధించిన అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఆమె పిఆర్ఓ ను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. ఒకవేళ పార్టీలో ప్రజాస్వామ్యం కనుక పకడ్బందీగా ఉంటే.. పార్టీ విధానాలు అందరికీ ఒకే విధంగా ఉంటే.. ఈ సమయానికి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఆ పని కాలేదు అంటే కారణం ఏమై ఉంటుంది.. ఒకవేళ కవితని గనుక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కేసీఆర్ ఎలాంటి ప్రతికూల పరిణామాలను ఎదురు కోవాల్సి ఉంటుంది.. ఇప్పుడు ఈ ప్రశ్నలకే సమాధానం లభించాల్సి ఉంది. ఆ సమాధానాల కోసమే తెలంగాణ సమాజం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో.. ఒకటి మాత్రం నిజం తెలంగాణ ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్టుగానే భారత రాష్ట్ర సమితిలో పరిణామాలు జరుగుతున్నాయి. పైకి సోషల్ మీడియాలో గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ మాడు వాసన మాత్రం విపరీతంగా వస్తుంది.. అది భారత రాష్ట్ర సమితిలో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.