BRS vs Kavitha : జాగృతి అధినేత్రి కవిత సోమవారం చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలలో సెగను రాజేస్తున్నాయి. ఏకంగా ఆమె తన కుటుంబంలో ఉన్న ఇద్దరు కీలకమైన వ్యక్తుల మీద ఆరోపణలు చేశారు. అది కూడా ప్రతిపక్షాలు కోరుకున్న స్థాయి కంటే ఎక్కువ విమర్శలు చేశారు. దీంతో అధికార పార్టీకి అనుకోని ఆయుధం లభించింది. నిండు శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏవైతే ఆరోపణలు చేశారో.. వాటికి బలం చేకూర్చుతూ జాగృతి అధినేత్రి వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాలలో సంచలనం కలిగిస్తోంది.
“నా తండ్రి మీద కేంద్ర దర్యాప్తు సంస్థను విచారణకు వస్తుందని తెలిసినప్పుడు పార్టీ ఉంటే ఎంత? ఊడితే ఎంత.. అసలు నా తండ్రి చుట్టూ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చేరి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. వారి సొంత ఆస్తులను పెంచుకున్నారు. అవినీతికి పాల్పడ్డారు. వారి వల్లే ఇదంతా. వారిద్దరి వల్ల నా తండ్రి అనవసరమైన మరకను మోస్తున్నారు.. వారిని దూరం పెడితే సరిపోతుంది.. నేనే చెబుతున్న కదా.. వారిపై చర్యలు తీసుకోండి. కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ చేయించండి. నా తండ్రికి ఏమీ తెలియదు. ఆయనకు డబ్బుల గురించి పట్టింపు ఉండదు. ఇతర విషయాల గురించి పట్టింపు ఉండదు.. కేవలం తెలంగాణను మాత్రమే ఆయన ప్రేమిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే శ్వాసిస్తారు” ఇదిగో ఇలా సాగిపోయింది జాగృతి అధినేత్రి విలేకర్ల సమావేశం. అతిమంగా తన తండ్రి మంచివాడని.. ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులే అవినీతిపరులని తెలంగాణ బతుకమ్మ ఉద్దేశం.
పిఆర్వో తొలగింపు
కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితికి చెందిన అధికారిక వాట్స్అప్ గ్రూపుల నుంచి ఆమె పిఆర్ఓ ను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. జాగృతి అధినేత్రికి సంబంధించిన ఎక్స్, ఇన్ స్టా, ఫేస్ బుక్ నుంచి చాలావరకు గులాబీ నేతలు అన్ ఫాలో అవుతున్నారు. కార్యకర్తలు కూడా అదేదారిలో ఉన్నారు. చూడబోతే జాగృతి అధినేత్రి మీద యుద్ధం ప్రకటించే విధంగా ఉన్నారు. అయితే ఇదంతా కూడా గులాబీ దళపతి ఆదేశాలు లేకుండా జరగదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి తెలంగాణ బతుకమ్మను ఒంటరి చేసే వ్యవహారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రయాణాన్ని జాగృతి అధినేత్రి ఏ విధంగా మొదలుపెడతారనేది చూడాల్సి ఉంది.