Vice-Presidential Election 2025: జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) సరికొత్త చిక్కు వచ్చి పడింది. అది ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపారు. భారతీయ జనతా పార్టీ అడిగిందో లేదో.. ఆ తరువాత రోజునే మద్దతు ప్రకటించేశారు. ఇలా మద్దతు ప్రకటించిన తరువాత.. మరో అభ్యర్థి మద్దతు కోరే అవకాశం లేదు. కానీ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు. అయితే తాము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి ముఖం మీదే చెప్పినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది. అయితే ఇది ఎంత మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సాహసించడం లేదు. ఏ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తారు అంటూ.. షర్మిల లాంటి నేతలు కూడా ప్రశ్నించడం ప్రారంభించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణ సంకటమే.
గుర్తింపు లేకపోవడంతో..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో స్తబ్దుగా ఉండిపోయారు రెడ్డి సామాజిక వర్గం( Reddy caste) నేతలు. 2014, 2019 ఎన్నికలతో పోల్చుకుంటే.. 2024 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం మనసు మారింది. దానికి కారణం లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేస్తే ఆ స్థాయిలో గుర్తింపు దక్కలేదు అన్నది రెడ్డి సామాజిక వర్గం బాధ. సరైన పదవులు ఇవ్వలేదు. ఆర్థికంగా చేయూతనివ్వలేదు. రెడ్డి సామాజిక వర్గంలో ఆ నలుగురు నేతల తప్ప మిగతా వారికి ప్రాధాన్యం లేకుండా పోయింది. వైసిపి రాజకీయాల కోసం తమను తక్కువ చేయడం పై రెడ్డి సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అయింది. ఆ అసంతృప్తి ఎన్నికల్లో ప్రభావం చూపింది.
తెలంగాణలో భిన్న వైఖరి..
మరోవైపు తెలంగాణలో( Telangana) సైతం జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరిపై రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అప్పుడే ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీస స్థాయిలో కూడా స్పందించలేదు. కనీసం అభినందనలు కూడా తెలపలేదు. సాటి సామాజిక వర్గం నేత తెలంగాణకు సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి సహించుకోలేకపోయారన్న అంశం తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంలోకి వెళ్ళింది. అక్కడ తమ సామాజిక వర్గం అధికారాన్ని చేపడితే.. కనీసం మద్దతు ఇవ్వకపోగా.. కెసిఆర్ కు ఇవ్వడం ఏమిటనే ప్రశ్న వినిపించింది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తుందని సంకేతాలు రావడంతో.. హైదరాబాదులో సెటిల్ అయినా ఏపీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. కానీ రేవంత్ గెలిచాక ఆయన విషయంలో జగన్ అనుసరించిన వైఖరి రెడ్డి సామాజిక వర్గానికి ఎంత మాత్రం నచ్చలేదు. ఆ ప్రభావం 2024 ఎన్నికలపై పడింది. అంతకుముందు ఎన్నికలకు మాదిరిగా జగన్ కు అండగా నిలవలేదు రెడ్డి సామాజిక వర్గం.
సుదర్శన్ రెడ్డికి జగన్ షాక్..
తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని( justice Sudarshan Reddy) ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదన చేసింది మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కానీ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగలేదు. ఇండియా కూటమిగాను ప్రకటించనూ లేదు. కేవలం ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అటువంటి వ్యక్తి నేరుగా ఫోన్ చేసి మద్దతు కోరితే.. చేయలేమని జగన్ తేల్చి చెప్పడం విశేషం. దీనిపై రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెట్టినట్లు అయింది. చూడాలి మున్ముందు పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో..