Kaantha Movie Review నటీనటులు: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సె, సముద్రకని, రానా దగ్గుబాటి, నిళల్ గళ్ రవి తదితరులు.
నేపథ్య సంగీతం: జేక్స్ బిజోయ్
పాటలు: ఝను చంతర్
ఛాయాగ్రహణం: డానీ సాంచెజ్ లోపెజ్
దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జొమ్ వర్గీస్
మలయాళ నటుడైనా… మహానటి, లక్కీ భాస్కర్ లాంటి డైరెక్ట్ తెలుగు చిత్రాలతో మన ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం కావడం, పైగా ఒక తమిళ నటుడి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం అని ప్రచారం జరగడంతో తమిళ డబ్బింగ్ సినిమా అయినా ఈ కాంత పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కలిసి నటించి, నిర్మించడంతో ఈ సినిమాలో కంటెంట్ ఏదో గొప్పగా ఉంటుందన్న అంచనాలు కూడా నెలకొన్నాయి. బ్లాక్ & వైట్ జమానాలోని కథ కావడం కూడా ఆసక్తి పెరగడానికి మరో కారణం. ఇన్ని అంశాలున్న ఈ కాంత చిత్రం మహానటి లాగా తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుందా లేదా అనేది చూద్దాం.
ఊరు పేరు లేని ఒక స్టేజ్ నటుడిని చేరదీసి సినీ రంగంలో బ్రేక్ ఇచ్చిన గురుతుల్యుడైన వ్యక్తి ఒకవైపు, అతని ప్రోత్సాహం, సహకారంతో స్టార్ గా ఎదిగిన శిష్యుడు మరోవైపు ఈ కథకు మూల స్తంభాలు. గురువుగా సముద్రకని, శిష్యుడి పాత్రలో దుల్కర్ నటించారు. గురువు అయ్యా(సముద్రకని), శిష్యుడు T.K.మహాదేవన్(దుల్కర్ సల్మాన్)లకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? వారిద్దరి మధ్య తలెత్తిన ఈగోతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? గురుశిష్యుల పోరాటంలో కుమారి(భాగ్యశ్రీ బోర్సె) పాత్ర ఎలా నలిగిపోయింది? ఇక పోలీస్ ఆఫీసర్ గా రానా దగ్గుబాటి వచ్చి ఏం చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన అంశాలు.
సినిమా నేపథ్యంలో సినిమా తీయడం అనేది కత్తిమీద సాము, పులి మీద స్వారీ లాంటిది. కాంత దర్శకుడు సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేశాడు. థీమ్ ప్రకారం గురు శిష్యుల మధ్య జరిగే ఇలాంటి ఈగో కథ అప్పట్లో స్వాతికిరణం సినిమాలో మరో యాంగిల్ లో చూపించినదే. ఆ సినిమాలో గురు శిష్యుల ప్రొఫెషన్స్ ఒకటే కానీ ఇక్కడ గురు శిష్యుల ప్రొఫెషన్స్ వేరు.. గురువు దర్శకుడు అయితే, శిష్యుడు నటుడు. ఇది కాకుండా మరో తేడా ఏంటంటే క్రైమ్ ఎలిమెంట్ ఉండడం. ఒకే సినిమాకు పని చేస్తున్న దుల్కర్, సముద్రకని ఇద్దరూ తమ ఈగోలతో పరస్పరం గొడవపడడం, ఈ గొడవల కారణంగా సినిమా అసలు పూర్తవుతుందా లేదా అని అందరూ టెన్షన్ పడడం ఒక అంశం. వీరిద్దరూ పనిచేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కుమారి(అంటే సినిమాలో సినిమా.. ఆ సినిమాలో హీరోయిన్ అన్నమాట) మొదట్లో గురువు వైపు ఉండడం, మెల్లిగా శిష్యుడితో ప్రేమలో పడడంతో కథ చాలా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే సినిమాలో దుల్కర్ కు అప్పటికే ఒక బిగ్ షాట్ కూతురితో పెళ్ళై ఉంటుంది. ఒక స్టార్ గా ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే మలుపులు ప్రేక్షకులకు థ్రిల్ ను పంచకపోగా, తలనొప్పిని తీసుకువస్తాయి.
ఫస్ట్ హాఫ్ కొంతవరకూ సాఫీగా సాగుతుంది కానీ ఎప్పుడైతే మర్డర్ జరుగుతుందో తదనంతర పరిణామాలు ప్రేక్షకుడిని తికమకపెడతాయి. ఇంటర్వల్ తర్వాత ఎంట్రీ ఇచ్చే పోలీస్ ఆఫీసర్ రానా దగ్గుబాటి పాత్ర అటు పూర్తిగా కామెడీ పంచలేక ఇటు సీరియస్ ఇన్వెస్టిగేషన్ అన్నట్టు చూపించలేక ట్రాక్ తప్పింది. ఇక ఈ సినిమాలో ప్రేక్షకుడిని మరింతగా ఇబ్బంది పెట్టే అంశం సినిమాలో సినిమా చూపించడం, ఆ సినిమా కూడా 80% పూర్తిగా ఒక సెట్ లో(ఇండోర్ షూట్) జరగడం. ఎంత సినిమాలో సినిమా అయినా సెట్ లోనే పూర్తి సినిమా చూపిస్తే సినిమా వాళ్ళకు బాగుంటుందేమో, ఆహా ఓహో అని వాళ్ళు చంకలు గుద్దుకుంటారేమో కానీ సాధారణ ప్రేక్షకులు భరించడం మాత్రం కష్టం.
హత్య చేసేంత దూరం ఎందుకు వెళతారు అనే దానికి ఎస్టాబ్లిష్ చేసిన రీజన్ కన్విన్సింగ్ గా లేదు. అసలు హత్యకే రీజన్ కన్విన్సింగ్ గా లేదు అన్నప్పుడు, ఆ హత్యకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సెకండ్ హాఫ్ అంతా చూపించడంతో ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. దానికి తోడు ప్రీ క్లైమాక్స్ లో గురు శిష్యులు ఇద్దరూ తమ మనసువిప్పి మాట్లాడుకునే సీన్ నిజానికి ఈ సినిమాలో ఉన్న డ్రామాకు పీక్ పాయింట్ అవ్వాలి కానీ అప్పటికే ప్రేక్షకులకు సహనం నశించిపోతుంది కాబట్టి దాన్ని పట్టించుకునే స్థితిలో ఉండరు. ఏదేమైనా ఈ సినిమా అటు మహానటి లాగా ఒక నటుడి జీవితం కాలేక ఇటు క్రైమ్ థ్రిల్లర్ కాలేక రెండిటి మధ్యలో నలిగిపోయింది.
ఈ సినిమాలో ఆర్ట్, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ లాంటివి చాలా బాగున్నాయి కానీ అసలు కథను ఆవిష్కరించే విధానమే గాడి తప్పింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడం ఖాయం. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ వీక్ గా ఉంది. కొన్ని చోట్ల మంచి డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ బాగున్నాయి కానీ మిగతా అంతా మేము ఒక నేషనల్ అవార్డ్ సినిమా తీస్తున్నాం అనే ఇంటెన్షన్ కనిపించింది కానీ ప్రేక్షకులను మెప్పించాలి అనేది మాత్రం గాలికి వదిలేసినట్టు కనిపించింది. ఈ సినిమా నిజానికి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కానీ రెండు ప్రధాన పాత్రల మధ్య ఈగో సమస్యలు ఉన్న పీరియడ్ డ్రామాగా ప్రెజెంట్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు తికమక పడడం ఖాయం. తమిళ ప్రేక్షకులకు మాత్రం ఈ పైత్యం నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారుల నటన మాత్రం అద్భుతం. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, సముద్రకని ఇద్దరూ తమ పాత్రలలో నటించారు అనడం కంటే జీవించారు అనడం సబబు. వీరిద్దరే కాకుండా అటు భాగ్యశ్రీ బోర్సె, నిళల్ గళ్ రవి అందరూ చక్కగా నటించారు.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. ఒక సెట్ లో సినిమా అంతా జరగడం
2. పాటలు
3. మిస్ ఫైర్ అయిన ఇన్వెస్టిగేషన్
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. దుల్కర్, సముద్రకనిల నటన
2. నేపథ్య సంగీతం
3. ఆర్ట్ వర్క్
ఫైనల్ వర్డ్: అటూ ఇటూ కాని సంత
రేటింగ్: 2/5
మొత్తంగా మహానటిని చూసి వాతలు పెట్టుకొని తీసిన సినిమా కథ. కథ వదిలి స్వారీ చేసిన వైనం ఇదీ.. తమిళ వాసనలతో ఒదుగుబొదుగు లేకుండా ప్రేక్షకులకు పరీక్ష పెట్టిన సినిమాగా చెప్పొచ్చు.
